ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్‌:  చింత‌ల రామ‌చంద్రారెడ్డి (ఖైర‌తాబాద్‌)

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అది ఖ‌రీదైన ఏరియాల్లో విస్త‌రించి ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ఖైర‌తాబాద్‌. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అతిపెద్ద నియోజ‌క‌వ‌ర్గం అయిన ఖైర‌తాబాద్ పున‌ర్విభ‌జ‌న‌లో నాలుగు చెక్కలు అయ్యింది. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్‌కు కూత‌వేటు దూరంలో ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే రాష్ట్ర ప్ర‌థ‌మ పౌరుడు గ‌వ‌ర్న‌ర్‌ రాజ్‌భ‌వ‌న్ నివాసం ఉంది. అతి ఖ‌రీదైన బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్నాయి. హైద‌రాబాద్‌లో పేరున్న స్టార్ హోట‌ల్స్‌కు, అతి ఖ‌రీదైన మాల్స్‌కు ఇది కేంద్రం. అలాగే 120 నిరుపేద బ‌స్తీలు కూడా ఉన్నాయి.

1967లో ఆవిర్భ‌వించిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2.68 ల‌క్ష‌ల ఓట‌ర్లు ఉన్నారు. ఇక్క‌డ 12 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే 9 సార్లు కాంగ్రెస్ అత్య‌ధికంగా గెలిచింది. టీడీపీ, బీజేపీ, ఇండిపెండెంట్ ఒక్కోసారి గెలుపొందాయి. ఇక దివంగ‌త కాంగ్రెస్ నేత పి.జ‌నార్థ‌న్‌రెడ్డి ఇక్క‌డ నుంచి ఏకంగా ఐదుసార్లు విజ‌యం సాధించారు. ఆయ‌న మ‌ర‌ణాంత‌రం జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న‌యుడు విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి ఏకంగా 1.92 ల‌క్ష‌ల భారీ ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే ఎన్నిక‌ల వ‌ర‌కు ఇదే భారీ మెజార్టీ. ఇక గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన చింత‌ల ఈ మూడున్న‌రేళ్ల‌లో ఎలాంటి ప‌నులు చేశారు ? ఆయ‌న ప్ల‌స్సులు, మైన‌స్‌ల లెక్కేంటో ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో చూద్దాం.

అభివృద్ధి ఎలా ఉంది… స‌మ‌స్య‌ల లెక్కేంటి…

ఇక ప్ర‌స్తుత ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డి ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌గా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 2009లో ఓడిపోయిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ+టీడీపీ పొత్తులో సీటు ద‌క్కించుకుని విజ‌యం సాధించారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 62 కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టిన‌ట్టు ఆయ‌న చెపుతున్నారు. సీఎం ద్వారా నియోజ‌క‌వ‌ర్గానికి 20 వేల ఎల్ఈడీ బ‌ల్పులు మంజూరు చేయించిన ఘ‌న‌త త‌న‌దే అని ఆయ‌న చెపుతున్నారు. ఎమ్మెల్యే ఎంతో చేశాన‌ని చెపుతున్నా ఇంత ఖ‌రీదైన నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ఎక్క‌డా కాన‌రావ‌డం లేదు.

నియోజ‌క‌వ‌ర్గంలో ఖ‌రీదైన ప్రాంతాలు ఉన్న‌ట్టే ఏకంగా 120 బ‌స్తీలు ఉన్నాయి. అన్నీ బ‌స్తీల్లోను మౌలిక వ‌స‌తుల స‌మ‌స్య‌లు చాలా ఎక్కువుగా ఉన్నాయి. రాజ్‌భ‌వ‌న్‌కు ఎదురుగా ఉన్న ఎంఎస్ మ‌క్తా అయితే చెత్త‌, చెత్త రోడ్లతో ఎప్పుడూ దుర్గంధం వెద‌జ‌ల్లుతూ ఉంటోంది. వ‌ర్షం కురిస్తే ఈ బ‌స్తీ వాసుల న‌ర‌కానికి లెక్కే ఉండ‌దు. ఇక ఎమ్మెల్యే చింత‌ల ఎన్నిక‌ల వేళ డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల హామీ ఇచ్చి మొఖం చాటేశార‌ని బ‌స్తీల జ‌నాలు మండిప‌డుతున్నారు.

ఇక ఎమ్మెల్యే వెర్ష‌న్ ఇలా ఉంటే మ‌రో విప‌క్షమైన కాంగ్రెస్ వెర్ష‌న్ మ‌రోలా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం టీడీపీతో పొత్తు వ‌ల్ల బీజేపీ లాభ‌ప‌డింద‌ని, మూడున్న‌రేళ్ల‌లో చింత‌ల ప‌నులు ఏం చేయలేద‌ని కాంగ్రెస్ వాళ్లు మండిప‌డుతున్నారు. అయితే ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ రాజ‌కీయంగా కూడా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు.

ఇక అధికార టీఆర్ఎస్ నుంచి ఇక్క‌డ ఇన్‌చార్జ్‌గా ఉన్న మ‌న్నె గోవ‌ర్థ‌న్‌రెడ్డి మాత్రం త‌మ పార్టీ నుంచి ఏకంగా వాట‌ర్ వ‌ర్క్స్ కోసం రూ.70 కోట్లు, స్కైవేల‌కు రూ.38 కోట్లు ఇప్పించామ‌ని, ఓవ‌రాల్‌గా రూ. 150 కోట్ల‌తో అభివృద్ధి చేశామంటున్నారు. బ‌స్తీ ప్ర‌జ‌లు మాత్రం ఇళ్ల విష‌యంలో సీరియ‌స్‌గా ఉన్నారు. బ‌స్తీల్లోనే ఎక్కువుగా ఓటింగ్ జ‌ర‌గ‌నుంది.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండ‌డం

– వివాద ర‌హితుడు అన్న ముద్ర‌

మైన‌స్ పాయింట్స్ (-):

– నియోజ‌క‌వ‌ర్గ రేంజ్‌కు త‌గిన అభివృద్ధి ప‌నులు లేక‌పోవ‌డం

– విప‌క్ష ఎమ్మెల్యేగా ఉండ‌డంతో ఆశించిన మేర నిధులు రాబ‌ట్ట‌క‌పోవ‌డం

– బ‌ల‌మైన వాయిస్ లేక‌పోవ‌డం

– ఓటింగ్‌కు కీల‌క‌మైన బ‌స్తీల్లో కాన‌రాని అభివృద్ధి

– టీడీపీతో పొత్తు లేక‌పోవ‌డం

తుదితీర్పు:

రాజ‌కీయంగా ఖైర‌తాబాద్‌లో ఇప్పుడు చింత‌ల‌కు గ‌త ఎన్నిక‌లంత అనుకూల‌త లేదు. తెలంగాణ‌లో టీడీపీ, బీజేపీ విడివిడిగా పోటీ చేయ‌డం ఖ‌రారు కావ‌డంతో ఇక్క‌డ బీజేపీ, టీడీపీ ఓట్లు చీల్చుకోనున్నాయి. ఇక కాంగ్రెస్ కూడా త‌న ఓట్ల‌ను చీల్చుకుంటుంది. ఇక ఇక్క‌డ టీఆర్ఎస్ గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే బాగా పుంజుకుంది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఇక్క‌డ తిరుగులేని విజయం సాధించింది. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నాలుగు స్తంభాలాట జ‌రిగితే చింత‌ల గెలుపు చాలా క‌ష్టం కానుంది.