బీజేపీ ఆప‌రేష‌న్ ” రెడ్డి ” స్టార్ట్‌

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ దూకుడుకు ప‌గ్గాలు వేసేందుకు బీజేపీ అదిరిపోయే స్కెచ్‌తో ఉందా ? 2019లో బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డం లేదా బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఎదిగేందుకు ప్ర‌ణాళిక‌తో ఉందా ? ఇందుకోసం ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప‌క్కా వ్యూహం ప‌న్నుతున్నారా ? అంటే తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల ఇన్న‌ర్ క‌థ‌నాల ప్ర‌కారం అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది.

తెలంగాణ‌లో సాధారణ ఎన్నికలు రెండేళ్లుండగానే పార్టీల్లో కదలిక మొదలైంది. ఉన్న నాయకత్వానికి.. కొత్త నాయకత్వాన్ని జత చేసి పార్టీలను పటిష్టం చేసుకోవాలన్న ఆలోచనకు బీజేపీ, కాంగ్రెస్ వచ్చాయి. బలం బలగాలను సిద్ధం చేసుకునే గ్రౌండ్ వర్క్ అంతర్గతంగా జరిగిపోతోంది. ఎవ‌రికి వారు ప్రాంతాలు, కులాలు ప‌రంగా స‌మీక‌ర‌ణ‌ల్లో మునిగి తేలుతున్నారు.

ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ అప్పుడే వ‌ర్క్ స్టార్ట్ చేసేసింది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో బ‌ల‌మైన రెడ్డి సామాజిక‌వ‌ర్గం ప్ర‌జాప్ర‌తినిధులను, కీల‌క నేత‌ల‌ను ఆక‌ర్షించే ప‌నిలో బీజేపీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో కాంగ్రెస్ పాల‌న‌లో కీల‌కంగా వ్య‌హ‌రించిన ఈ సామాజిక‌వ‌ర్గానికి చెందిన కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను బీజేపీ చేర్చుకునే బాధ్య‌త‌ను అమిత్ షా ఇప్ప‌టికే కొంద‌రు తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే టీ బీజేపీ నేత‌లు మాజీ స్పీక‌ర్ కెఆర్‌.సురేష్‌రెడ్డితో పాటు మెద‌క్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సునీతా ల‌క్ష్మారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణను బీజేపీలోకి ఆహ్వానించిన‌ట్టు ఇంట‌ర్న‌ల్‌గా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. వీరు బీజేపీలో చేరితే వారు కోరుకున్న టిక్కెట్ల‌తో పాటు ఆయా జిల్లాల్లో వీరికే కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తామ‌ని కూడా హామీలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఏదేమైనా కేసీఆర్‌కు బ్రేకులేసేందుకు బీజేపీ స్టార్ట్ చేసిన ఈ కొత్త రెడ్డి ఆప‌రేష‌న్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.