బోండాకు స‌మ‌యం చూసి వాత‌పెడ‌తారా?

తాము ఆశించిన ప‌ద‌వులు ద‌క్క‌ని సంద‌ర్భాల్లో నేత‌లు తీవ్ర అసంతృప్తికి గుర‌వ‌డం.. అధిష్ఠానంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మే!! ఒక్కోసారి ప్ర‌భుత్వ విధానాలపైనే మాట్లాడి అటు అధిష్ఠానం దృష్టిలో, ఇటు ప్ర‌జ‌ల దృష్టిలో చుల‌క‌న‌గా మిగిలిపోతారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు ప‌రిస్థితి కూడా ఇలానే మారింది. కాపుల అభివృద్ధికి ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నామ‌ని ఒక‌ప‌క్క టీడీపీ పెద్ద‌లంతా నొక్కిచెబుతుంటే.. కాపుల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని వ్యాఖ్యానించి.. అధిష్ఠానం దృష్టిలో నోటెడ్ అయ్యారు. అయితే వివాదం స‌ద్దుమ‌ణిగినా.. మ‌రి భ‌విష్య‌త్తులో సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేష్ ఆయ‌న‌తో ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

విజ‌య‌వాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వ‌ర‌రావు తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడు. గతంలో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా తన సామాజికవర్గానికి చెందిన నాయకులందరూ, కార్యకర్తలు ప్రజారాజ్యం పార్టీలో చేరినా ఆయన మాత్రం టీడీపీలోనే కొనసాగారు. ఆ విధేయతే ఆయనకు 2014లో కలసివచ్చి ఎమ్మెల్యేను చేసి చంద్రబాబుకు దగ్గర చేసింది. విపక్షాలపై ధీటుగా స్పందించడమే కాకుండా చంద్రబాబు, చినబాబులపై ఈగ వాలనివ్వకుండా దూకుడుగా విమర్శలు చేసి వారిద్దరి మన్నలను పొందారు. దీంతో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని ఆశ‌లు పెంచుకున్నారు.

ఆఖరు నిమిషంలో కులాల సమీకరణలో ‘బోండా’కు మంత్రి పదవి లభించలేదు. దీంతో ఆయన బాహాటంగా విమర్శలు చేయటమే కాకుండా చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశారు. కాపులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని తూలనాడారు. చివరకు ఇది అధినేతకు ఆగ్రహం తెప్పించింది. దీంతో చంద్రబాబు ఆయనను పిలిపించి చీవాట్లు పెట్టారు. `మొదటసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించావు. ఎంతో రాజకీయ భవిష్యత్‌ ఉంది. అయినా మంత్రి పదవి ఇవ్వలేదని బాహాటంగా, కులపరంగా విమర్శలు చేయటం తగునా?` అని క్లాస్‌ పీకారట.

`నువ్వు విజయవాడలో ఏయే పనులు చక్కపెట్టుకున్నావో…నాకు తెలుసు…నా దగ్గర అన్ని రిపోర్టులు ఉన్నాయి!` అన్నార‌ట‌. నిన్నటి వరకు కాపులకు న్యాయం చేసింది టీడీపీ ప్రభుత్వమే అని ముద్రగడ పద్మనాభవంపై దాడికి దిగిన బోండానే ఆయనకు మంత్రి పదవి దక్కపోవడంపై కాపులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని బయటపడి విమర్శలు చేసి చేతులు కాల్చుకున్నారు. నిన్నటి వరకు చంద్రబాబు,లోకేష్ దగ్గర ఆయనకు ఎంతో విలువ ఉంది. తాజా సంఘట నలతో వారిద్దరూ బోండా విమర్శలను పిల్లచేష్టలుగా భావించి కొట్టిపారేస్తారా…? మనసులో పెట్టుకుని సమయం చూసి వాతపెడతారా? అనేది వేచిచూడాల్సిందే!