భార‌త్‌లో బుల్లెట్ ట్రైన్‌..మోడీకి విమ‌ర్శ‌ల వెల్లువ‌!

September 14, 2017 at 10:23 am
Bullet Train, India, modi

భార‌త్‌లో బుల్లెట్ ట్రైన్ వ‌స్తోంది. త్వ‌ర‌లోనే ఈ ట్రైన్ ప‌ట్టాల మీద‌కి కూడా ఎక్క‌బోతోంది. దేశంలో తొలి బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు కావడం, అది కూడా ప్ర‌ముఖ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్‌ఈఎల్‌) ద‌క్కించుకోవ‌డం ఒక ప‌క్క ఆనందం క‌లిగిస్తోంది. రూ.1.1 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును జ‌పాన్ సాయంతో పూర్తి చేయ‌నున్నారు. గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్- మ‌హారాష్ట్ర‌లోని ముంబైల మ‌ధ్య ఈ ట్రైన్ ప‌ర‌గులు పెట్ట‌నుంది. దీనికి సంబంధించిన శంకుస్థాప‌న కూడా గురువారం అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిపోయింది. దీంతో బిహెచ్ఇఎల్ స్టాక్‌ ఈ భారీ లాభాలతో 52 వారాల గరిష్టాన్ని తాకింది.

ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ గురించిన మ‌రో కోణం చూస్తే.. దీనిపై దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తు తున్నాయి. ఉన్న ట్రైన్‌ల‌కే దిక్కులేక జ‌నాలు ఏడుస్తుంటే.. బుల్లెట్ ట్రైన్ ఎందుకు? అని నెటిజ‌న్లు భారీ సంఖ్య‌లో విరుచుకుప‌డుతున్నారు. గ‌త నెల రోజుల్లో దేశ‌వ్యాప్తంగా 8 రైలు ప్ర‌మాదాలు సంభ‌వించాయి. ఆయా ప్ర‌మాదాల్లో మొత్తంగా 60 మంది వ‌ర‌కు ప్రాణాలుకోల్పోయారు.దీనికి రైల్వేల నిర్ల‌క్ష్యం, సంస్థ నిర్వ‌హ‌ణా లోపాలు ఉన్నాయ‌ని నిపుణులు చెప్పారు. అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం ఉన్న రైళ్ల‌లో అనేక లోపాలు ఉన్నాయి. ఏ చిన్న అగ్ని ప్ర‌మాదం సంభ‌వించినా.. ప్ర‌యాణికుల ప్రాణాలు నిలువునా కాలిపోతున్నాయి. దీంతో రైల్వేల‌పై ప్ర‌జ‌ల్లో చిన్న‌చూపు ఉంది.

ఇక‌, మ‌రో ప్ర‌ధాన విష‌యం దేశ‌వ్యాప్తంగా అనేక ప్రాంతాల‌కు రైళ్ల‌ను క‌నెక్ట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నివేదిక‌లు చాటుతున్నాయి. ఇప్ప‌టికీ కొన్ని రాష్ట్రాల్లోనే రైల్వేల అనుసంధానం స‌క్ర‌మంగా ఉంది. మ‌రికొన్ని రాష్ట్రాలు రైల్వేల కోసం ఎదురు చూస్తున్నాయి. అదేవిధంగా భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను పెంచాల్సి ఉంది. ఇన్ని ప‌నులు చేయ‌డానికి రైల్వేల వద్ద ఉన్న నిధులు స‌రిపోవ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూడాల్సి వ‌స్తోంది. ఇన్ని స‌మ‌స్య‌లు పేరుకుపోయిన రైల్వే వ్య‌వ‌స్థ‌ను ఒడ్డుకు చేర్చి లాభాల బాట ప‌ట్టించ‌డం మానేసిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అంటూ లేనిపోని వింత విన్యాసాల‌కు పోయి.. రాజ‌కీయాలు చేయ‌డం ఎందుకు అని నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి మోడీగారు దీనికి ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.

 

భార‌త్‌లో బుల్లెట్ ట్రైన్‌..మోడీకి విమ‌ర్శ‌ల వెల్లువ‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts