`నంద్యాల‌`లో అఖిల‌ప్రియ‌ను ఒంట‌రి చేస్తున్నారా?

నంద్యాల ఉప ఎన్నిక మంత్రి భూమా అఖిల‌ప్రియ‌కు ప‌రీక్ష పెట్ట‌బోతోంద‌నే చ‌ర్చ టీడీపీలో మొద‌లైంది. త‌మ వ‌ర్గానికే సీటు కేటాయించాల‌ని అధిష్టానం వ‌ద్ద తీవ్రంగా ప‌ట్టుబ‌ట్టి.. చివ‌ర‌కు త‌న మాటే నెగ్గించుకున్నారు. అయితే ఇక్క‌డితోనే అయిపోలేద‌ని.. ఆ అభ్య‌ర్థిని గెలిపించుకుంటేనే ఆమె బ‌లం తెలుస్తుంద‌ని పార్టీ సీనియ‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా వైసీపీ కూడా ఈ ఉప ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని తీవ్ర ప‌ట్టుద‌ల‌తో ఉన్న త‌రుణంలో.. అఖిల‌ప్రియ‌ రాజ‌కీయ ప‌రిణితి, వ్యూహాల‌కు ఇదొక ప‌రీక్షలా మార‌బోతోంద‌ని అంతా భావిస్తున్నారు. మ‌రి ఇందులో ఆమె ఎంత‌వ‌ర‌కూ విజ‌యం సాధిస్తుంద‌నే అంశంపైనే ప్ర‌స్తుతం తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో సీటు కోసం నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ శిల్పా, భూమా వ‌ర్గం మ‌ధ్య తీవ్రంగా పోటీ నెల‌కొన్న విష‌యం తెలిసిందే. అనంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో శిల్పా మోహ‌న‌రెడ్డి వైసీపీలో చేరిపోవ‌డం.. టీడీపీ అభ్య‌ర్థిగా భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్ర‌హ్మానంద రెడ్డిని ప్ర‌క‌టించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇందులో భూమా అఖిల‌ప్రియ కీల‌కంగా వ్య‌వ‌హరించార‌న్నది కాద‌న‌లేని వాస్త‌వం! ముఖ్యంగా ఈ ఎన్నిక‌ల్లో గెలుపు బాధ్య‌త అంతా అఖిల ప్రియ వ‌ర్గ‌మే మోయాల్సి వ‌స్తోంది! ఆమెకి ఈ బై ఎల‌క్ష‌న్స్ అగ్నిపరీక్షే అని చెప్పాలి. బ్రహ్మానంద రెడ్డి అభ్య‌ర్థిత్వాన్ని నంద్యాల టీడీపీలోని అంద‌రూ అంగీక‌రిస్తున్నారా అనేది అస‌లు ప్ర‌శ్న‌గా మారింది.

భూమా మ‌ర‌ణించారు కాబ‌ట్టి.. ఆ ఫ్యామిలీకి కొంత సానుభూతి ఉంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ కుటుంబానికే టిక్కెట్ ఇవ్వ‌డం ఆన‌వాయితీ! దీనిని సీఎం చంద్ర‌బాబు పాటించారు. దీంతో ఒక‌వేళ ఈ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోతే దానికి తాను బాధ్యుడి కాద‌ని ఏవీ సుబ్బారెడ్డి ముందే ప్రిపేర్ అవుతున్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో బ్ర‌హ్మానంద రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్య‌త అంతా అఖిల ప్రియ భుజ‌స్కందాల‌పైనే ఉంద‌నేది అర్థ‌మౌతోంది. కాబ‌ట్టి, ఆమె ఒక్క‌రే భారీ ఎత్తున ప్ర‌చారానికి వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డంతో త‌మ బాధ్య‌త పూర్త‌యింద‌ని చంద్ర‌బాబు కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

నిజానికి, నంద్యాల గెలుపుపై టీడీపీ పెద్ద‌ల‌కే ఫిఫ్టీ ఫిఫ్టీ న‌మ్మ‌కాలున్నాయ‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గ‌తంలో టీడీపీ టిక్కెట్ తో భూమా పోటీచేసినా అక్క‌డ గెల‌వ‌లేదు! నంద్యాల‌లో టీడీపీకి చేదు అనుభ‌వం ఎదురైతే దానికి ప‌ర్తి బాధ్యురాలిగా అఖిల ప్రియే అని చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం కూడా చేయ‌చ్చు! ఇది అఖిల ప్రియ మంత్రి ప‌ద‌వికే ఎస‌రు ప‌డొచ్చు. భూమా వ‌ర్గానికి ఒక అవ‌కాశం ఇచ్చామ‌నీ, కానీ వారు నిరూపించుకోలేకపోయామ‌నే ప్ర‌చారం జ‌ర‌గొచ్చు! ఇక రానురానూ భూమా సెంటిమెంట్ కూడా ప్ర‌జ‌ల్లో త‌గ్గే అవ‌కాశాలూ లేక‌పోలేదు! ఇది అఖిల‌ప్రియ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు విఘాతంలా మారే అవ‌కాశాలూ లేక‌పోలేదు!