శిల్పా, అఖిల ప్రియ‌ల్లో పొలిటిక‌ల్ స‌న్యాసం ఎవ‌రికో?! 

నంద్యాల ఉప ఎన్నిక‌ పొలిటిక‌ల్ హీట్‌ను ఓ రేంజ్‌లో పెంచేస్తోంది. అటు అధికార టీడీపీ, ఇటు వైసీపీ అధినేత‌లు ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. బాబేమో అభివృద్ది మంత్రం ప‌టిస్తుంటే… జ‌గ‌న్ మాత్రం సెంటిమెంట్‌ను న‌మ్ముకున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఉప ఎన్నిక ఇరు ప‌క్షాల్లోనూ హీట్‌ను పెంచేసింది అని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే, దీనికి మ‌రింత వేడి పెంచేస్తూ.. మంత్రి భూమా అఖిల ప్రియ పెద్ద కామెంట్లు చేశారు. ఈ ఉప ఎన్నిక‌ను తాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నాన‌ని, ఎన్నిక‌ల్లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఓడిపోతే త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఆమె ప్ర‌క‌టించారు.

అంత‌టితో ఆగ‌కుండా.. అస‌లు రాజ‌కీయాల నుంచే త‌ప్పుకుంటాన‌ని చెప్పింది. ఈ కామెంట్లు తీవ్ర‌స్థాయిలో సంచ‌ల‌నం రేపుతున్నాయి. అదేస‌మ‌యంలో బ్ర‌హ్మానంద రెడ్డి గెలిస్తే.. ఆ క్రెడిట్ మాత్రం బాబుకి, పార్టీకి, ప్ర‌భుత్వానికే చెందుతుంద‌ని కూడా అఖిల పేర్కొంది. ఇక‌, ఈ క్ర‌మంలోనే శిల్పా కూడా కామెంట్ల వ‌ర్షం కురిపించేశాడు. తాను ఓడిపోతే..తాను కూడా రాజ‌కీయాల నుంచి తప్పుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు. మంత్రి స‌వాల్‌ను స్వీక‌రిస్తున్నాన‌న్నారు.

ఇలా ఇరు ప‌క్షాల నేత‌లు కామెంట్లు చేసుకోవ‌డం పొలిటిక‌ల్‌గా నంద్యాలలో సంచ‌ల‌న టాపిక్‌గా మారింది. అయితే, అఖిల ప్రియ కామెంట్లు వ్యూహాత్మ‌కంగా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. భూమా వ‌ర్గానికి స్థానికంగా పార్టీల‌తో సంబంధం లేకుండా మంచి పేరుంది. దీనికితోడు ఇటీవ‌ల మంత్రి స్థాయిలో అఖిల ప్రియ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నులు చేప‌ట్టింది. ఈ నేప‌థ్యంలో ఆమె ఓడిపోతే.. అంటూ స‌వాల్ రువ్వ‌డం వెనుక సెంటిమెంట్‌ను రాజేయ‌డ‌మేన‌నే టాక్ వినిపిస్తోంది. గత 2014 ఎన్నిక‌ల్లోనూ భూమాకి వైసీపీ క‌న్నా వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట బాగా వ‌ర్క‌వుట్ అయింద‌ని కొంద‌రు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే అఖిల ప్రియ సెంటిమెంట్‌గా ముందే తాను రాజీనామా చేస్తాన‌ని, పొలిటిక‌ల్‌గా దూరం అవుతాన‌ని అన‌డం ద్వారా మొత్తానికి భూమా కుటుంబ‌మే పాలిటిక్స్‌కి దూరం అవుతుంద‌నే విష‌యాన్ని సెంటిమెంట్‌గా ఆమె ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. దీనిని నంద్యాల ప్ర‌జ‌లు హ‌ర్షించ‌లేరు కాబ‌ట్టి.. ఖ‌చ్చితంగా బ్ర‌హ్మానంద రెడ్డికి ఓటు వేస్తార‌ని అంటున్నారు.

దీనికితోడు భూమా మ‌ర‌ణం కూడా ఫిఫ్టీ ప‌ర్సంట్ ప‌నిచేస్తుంద‌ని అంటున్నారు. సో.. అఖిల ప్రియకు ఢోకాలేద‌ని మ‌రో వ‌ర్గం క‌థనం. ఇక‌, శిల్పానే రాజ‌కీయంగా దెబ్బ‌తినే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను తిట్టిపోసి.. బాబును పొడిగి.. ఇప్పుడు అదే నోటితో బాబును తిట్టి.. ఓట్లు రాబ‌ట్ట‌గ‌ల‌రా? అనేది పెద్ద ప్ర‌శ్న‌గా మారింద‌ని దీనిని ప్ర‌జ‌లు కూడా హ‌ర్షించే ప‌రిస్థితిలేద‌ని అంటున్నారు.