తెలంగాణ పాలిటిక్స్‌లో కులాల కుంప‌టి

బంగారు తెలంగాణ సాకారం అవుతుంద‌ని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అక్క‌డి రాజ‌కీయ నేత‌లు.. కులాల తెలంగాణను చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం మింగుడు ప‌డ‌డం లేదు. వాస్త‌వానికి ఏపీలో మాత్ర‌మే కులాల కుమ్ములాట‌లు ఉన్నాయ‌ని, అక్క‌డ మాత్ర‌మే రాజ‌కీయాలు కులాల‌తో నిండిపోయాయ‌ని గ‌తంలోనే అనేక‌సార్లు టీఆర్ ఎస్ అధినేత‌గా, సీఎంగా కూడా కేసీఆర్ విమ‌ర్శించారు. అయితే, ఇప్పుడు మాత్రం తెలంగాణ‌లో కులాల కుంప‌ట్లు రాజుకున్నాయి. కులం కార్డుతో ఒక‌రి నొక‌రు ఓడించుకునేందుకు, కులం కార్డుతో ప్ర‌జ‌ల్లో బ‌లంగా నాటుకునేందుకు ఎవ‌రికి వారే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

తాజా విష‌యానికి వ‌స్తే.. ఏ రాష్ట్రంలో అయినా.. ఎక్కువ‌గా ఏ సామాజిక వ‌ర్గం ఉంటే ఆ సామాజిక వ‌ర్గం ఆధిప‌త్యం చ‌లాయిస్తుంద‌ని అనుకుంటారు. అయితే, తెలంగాణ‌లో మాత్రం ఇది రివ‌ర్స్ అయింది. అతి త‌క్కువ‌గా అంటే 0.5 % జ‌నాభా మాత్ర‌మే ఉన్న వెలమ వ‌ర్గానికి చెందిన కేసీఆర్ రాష్ట్రంలోని మిగిలిన వ‌ర్గాలను పాలిస్తున్నారు. ఇక‌, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 92% ఉన్నా.. వారికి త‌గిన ప్రాధాన్యం మాత్రం లేద‌ట‌. మిగిలిన 8% అగ్ర‌వ‌ర్ణాల‌దే పొలిటిక‌ల్‌గా ఆధిప‌త్యం ఉంద‌ని ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది. ముఖ్యంగా రెడ్లు 2%, క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు 2.5% ఉన్నారు.

దీంతో త‌మ‌క‌న్నా అత్యంత త‌క్కువగా ఉన్న 0.5% మాత్ర‌మే ఉన్న వెలమ వ‌ర్గానికి చెందిన కేసీఆర్‌.. రాష్ట్రాన్ని శాసించ‌డంపై ఇటీవ‌ల పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ విమ‌ర్శించారు. దీంతో రాష్ట్రంలో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా కులాల వైపు మ‌ళ్లాయి. కేసీఆర్ అంటే గిట్ట‌ని రేవంత్ రెడ్డి కూడా తాను టీడీపీ అన్న విష‌యాన్ని మ‌రిచిపోయి.. కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టి ఆరోప‌ణ‌లు గుప్పించేశారు. దీంతో టీఆర్ ఎస్ నేత ప్రకాశ్ వీరిని టార్గెట్ చేశారు. రెడ్లు 2 శాతం వుంటే కమ్మలు 2.5శాతం వున్నారని ఆ విధంగా చూస్తే సంఖ్యా పరంగా వారే ఎక్కువని అన్నారు.

ఇదే సంద‌ర్భంలో తెలంగాణ సాయుధ పోరాటం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. దొర‌లు ప్ర‌జా కంట‌కులని, రెడ్లు వారిపై పోరాడార‌ని తెర‌మీద‌కి వ‌చ్చింది. దీంతో రాబోయే రోజుల్లో వెలమ దొర‌ల‌పై పోరాడేది రెడ్లు మాత్ర‌మే అనే విధంగా చ‌ర్చ‌ను దారిమ‌ళ్లించారు. ఇక‌, ఇదే విష‌యంలోకి ప్రొఫెస‌ర్ కోదండరాంను కూడా ముడిపెట్టారు. ఆయ‌న రెడ్డి వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో కాంగ్రెస్‌తో కలసి తమను ఓడించడానికి వ్యూహాలు పన్నుతున్నారని ప్రకాశ్‌ ఆరోపించారు.

అంతేకాదు, సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం సామాజిక న్యాయ యాత్ర రాష్ట్రమంతా జరిగితే కోదండరాం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల నియోజవర్గాలకే వచ్చి వివాదం పెంచుతున్నారని ఆరోపించారు. మొత్తానికి రాష్ట్రంలో వెల‌మ వ‌ర్సెస్ రెడ్లుగా రాజ‌కీయం రంగు మారుతోంది. 2019 నాటికి ఇది మ‌రింత ముదిరే అవ‌కాశం కూడా ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలోనే ఎక్కువుగా క్యాస్ట్ పాలిటిక్స్ జ‌రుగుతుంటే అది ఇప్పుడు తెలంగాణ‌లోను ముదిరిపోయింది.