కేంద్ర నిఘా సంస్థ‌ల నివేదిక‌లో నంద్యాల‌లో వైసీపీ మెజార్టీ లెక్క ఇదే

నంద్యాల.. నంద్యాల‌.. నంద్యాల‌..! క‌ర్నూలు జిల్లాలోని ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌పై ఇప్పుడు అంద‌రి దృష్టీ ప‌డింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇక్క‌డ అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు ఎవ‌రికి వారు త‌మ‌దే విజ‌యం అంటే త‌మ‌దేన‌ని, త‌మ‌దే భారీ మెజారిటీ అంటే .. కాదు త‌మ‌దేన‌ని ఒక‌రికొక‌రు లెక్క‌లు వేసుకుంటున్నారు. అంతేకాదు, విజ‌యంపై గ‌ట్టి ధీమాగా కూడా ఉన్నారు. ఎవ‌రికి వారు వ్యూహ ప్ర‌తి వ్యూహాల‌తో ముందుకు వెళ్తున్నారు. ఎలాగైనా గెలిచి తీరాల‌ని ప‌ట్టుద‌ల‌తో ముందుకు వెళ్తున్నారు.

నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఏర్ప‌డిన ఖాళీని భ‌ర్తీ చేసేందుకు జ‌రుగుతున్న ఈ ఉప పోరును టీడీపీ, వైసీపీ ప‌క్షాలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో మూడేళ్లుగా జ‌రుగుతున్న చంద్ర‌బాబు పాల‌న‌ను తిప్పికొట్టేందుకు నాందిగా జ‌రుగుతున్న ఎన్నిక‌లుగా వీటిని వైసీపీ అధినేత జ‌గ‌న్ అభివ‌ర్ణించ‌గా.. విభ‌జ‌న‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన రాష్ట్రాన్ని గ‌త మూడేళ్లుగా తాను సంస్క‌రిస్తున్నాన‌ని, ఎక్క‌డా చేయ‌ని విధంగా రైతు, డ్వాక్రా రుణాల మాఫీ చేశాన‌ని, రాష్ట్రం కోసం నా కుటుంబాన్ని సైతం వ‌దిలేసుకున్నాన‌ని ప‌లు సంద‌ర్భాల్లో సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. రోజుకు 20 గంట‌ల‌పాటు రాష్ట్రం కోసం తాను చెమ‌ట చిందిస్తున్నాన‌న్నారు.

ఈ నేప‌థ్యంలోనే నంద్యాల ఓట‌ర్లు.. టీడీపీకి ప‌ట్ట‌క‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. దీంతో అటు టీడీపీ, ఇటు వైసీపీల‌కు ఈ ఎన్నిక ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిపోయింది. దీంతో భారీ ఎత్తున కోట్ల‌కు కోట్ల‌కు ఖ‌ర్చు చేసేందుకు కూడా ఇరు పార్టీలూ వెనుకాడడం లేదు. అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ స‌ద్వినియోగం చేసుకుని దూసుకుపోతున్నాయి. ఇక‌, మ‌రో నాలుగైదు రోజుల్లోనే ప్ర‌చారానికి తెర‌ప‌డి, ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం అవుతోంది. నేప‌థ్యంలోనే ఇప్పుడు గెలుపు ఎవ‌రిది? అనే చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. గెలుపు త‌మ‌దంటే త‌మ‌ద‌ని ఇరు పార్టీలూ చెబుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే అనేక స‌ర్వేలు సాగుతున్నాయి. ప‌లువురు ఏ పార్టీ వారు ఆ పార్టీకి అనుకూలంగా కూడా స‌ర్వే రిపోర్టుల‌ను బ‌య‌ట పెడుతున్నారు. తాజాగా కేంద్ర నిఘాసంఘం కూడా నంద్యాల ప‌రిస్థితిపై స‌ర్వే చేసింది. ఇక్క‌డి ఓట‌ర్ల నాడిని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్ర‌మంలో నిర్వ‌హించిన స‌ర్వేలో విప‌క్షం వైసీపీకే ఇక్క‌డి ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మైంద‌ట‌. ఆ పార్టీకి వచ్చే మెజారిటీ కూడా దాదాపు ఆరువేల వరకూ ఉండొచ్చని నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, టీడీపీ నేత‌లు మాత్రం.. త‌మ‌కు ప‌దివేల ఓట్ల మెజారిటీ లభించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏది నిజ‌మో తేలాలంటే.. మ‌రో ప‌ది రోజులు ఆగాల్సిందే.