క‌ల‌ల రాజ‌ధానికి ఇన్నిసార్లు శంకుస్థాప‌న‌లా!

ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ఎప్పుడెప్పుడు ప్రారంభ‌మ‌వుతుందా? అని ఆంధ్రా ప్ర‌జ‌లు వేయిక‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ప్ర‌పంచ‌స్థాయి హంగుల‌తో అంత‌ర్జాతీయ స్థాయిలో అద్భుత న‌గ‌రాన్ని నిర్మిస్తాన‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు పదేప‌దే చెబుతున్నారు. ప్ర‌జ‌లు కూడా అంతేస్థాయిలో ఆయ‌న‌పై న‌మ్మ‌కం పెట్టుకున్నారు. అయితే డిజైన్లు మారుతున్నాయి.. మాస్ట‌ర్ ఆర్కిటెక్ సంస్థ‌లు మారుతున్నాయి.. ఒక‌టి కాదు రెండు కాదు ఇప్ప‌టివ‌ర‌కూ ఏకంగా మూడు సార్లు అమ‌రావ‌తికి శంకుస్థాప‌న చేశారు చంద్ర‌బాబు. కానీ భ‌వంతుల నిర్మాణానికి అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. ఇక ఇప్పుడు నాలుగోసారి శంకుస్థాప‌న చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు ఏపీ సీఎం!!

విభ‌జ‌న‌తో రాజ‌ధాని కూడా లేని ఏపీకి.. ప్ర‌పంచ స్థాయిలో అన్ని హైటెక్ హంగుల‌తో నగ‌రాన్ని నిర్మించ‌డ‌మే త‌న క‌ల అని ఏపీ సీఎం చంద్ర‌బాబు వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా చెబుతున్నారు. ఇందుకు త‌గిన‌ట్టుగానే ఆర్కిటెక్ సంస్థ‌ల‌ను కూడా ఆహ్వానిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ సంస్థ‌లు మారుతున్నాయి. ముందుగా ఎంపిక చేసిన ఆర్కిటెక్ సంస్థ‌లు ఇచ్చిన‌ కొన్ని డిజైన్లు క్షుణ్ణంగా ప‌రిశీలించడం చివ‌ర‌కు అవి వేరే న‌మూనా ఆకృతుల్లో ఉన్నాయ‌ని మ‌రో కొత్త సంస్థ‌ను ఎంపిక చేయ‌డం.. ఇదీ గ‌త మూడున్న‌రేళ్లుగా జ‌రుగుతున్న తంతు!! అయితే ఈ డిజైన్ల సంగ‌తెలా ఉన్నా.. శంకుస్థాప‌న‌ల మీద శంకుస్థాప‌న‌లు చేసేస్తున్నారు చంద్ర‌బాబు!

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి తొలుత సీఎం చంద్ర‌బాబు కుటుంబ సమేతంగా శంకుస్థాపన చేశారు. తర్వాత విజ‌య‌ద‌శ‌మికి ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా మరోసారి శంకుస్థాపన చేశారు. ఆయన ఓ మట్టికుండతో నీళ్లు.. మ‌ట్టి ఇచ్చి రాజ‌ధాని నిర్మాణానికి త‌న‌వంతు సాయం చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత పరిపాలన భవనాలకు శంకుస్థాపన అంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మరోసారి శంకుస్థాపన చేయించారు. ఇప్పుడు మళ్లీ ద‌స‌రా వ‌చ్చేస్తోంది. దీంతో అసెంబ్లీ, సచివాలయాలకు నాలుగోసారి శంకుస్థాపన చేసేందుకు రెడీ అయిపోయారు? అసలు ఒక్క రాజధానికి శంకుస్థాపన ఎన్నిసార్లు చేస్తారు.

అమరావతి డిజైన్లను అక్టోబర్ 25న చంద్రబాబు లండన్ వెళ్లి ఖరారు చేస్తారట. అసలు డిజైన్లు లేకుండా శంకుస్థాపన ఎలా చేస్తార‌నేది అంద‌రి సందేహం! గ‌తంలో సీఆర్ డీఏ అధికారులు సినీ ద‌ర్శ‌కుడు రాజమౌళిని కలిసి రాజ‌ధాని నిర్మాణానికి సాయ‌మందించాల‌ని కోరారు. మళ్లీ వదిలేశారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు మళ్లీ రాజమౌళి జపం మొదలుపెట్టారు. తక్షణమే ఆయన సాయం తీసుకుని లండన్ తీసుకెళ్లి.. ఆర్కిటెక్ సంస్థ‌ నార్మన్ ఫోస్టర్ అధికారుల‌కు సలహాలు.. సూచనలు ఇవ్వాల‌ని సూచించార‌ట‌. నార్మ‌న్ పోస్ట‌ర్ డిజైన్ల‌ను ప‌రిశీలించిన మంత్రులు పెద‌వి విరిచారు. దీంతో మరింత సమయం తీసుకుని అత్యద్భుతమైన డిజైన్లు రూపొందించాలని ఫోస్టర్ బృందాన్ని సీఎం కోరార‌ట‌.

చంద్రబాబుకు రాజధాని కట్టాలనే ఆలోచన ఉందా? లేదో అర్థం కావటంలేదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఎప్పటికప్పుడు ప్రపంచ శ్రేణి రాజధాని అంటూ..ప్రపంచ శ్రేణి డిజైన్లు కేవలం డిజైన్ల కోసం ఏడాదిన్నర కాలయాపన చేసిన ప్రభుత్వం ఏదీ ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. డిజైన్ల పేరుతో ఇంత కాలయాపన చేయటం..ఒకే పనికి పదే పదే శంకుస్థాపన చేయటం మాత్రం ప్రజల్లో ప్రభుత్వంపై చులకన భావం ఏర్పడటం ఖాయం అని వ్యాఖ్యానిస్తున్నారు.