బాబుకు అన్ని వైపులా ఇన్ని ప‌రీక్ష‌లా!! 

నిజం! ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఏమీలేదు. ఒక వైపు రాష్ట్ర అభివృద్ధి. మ‌రోవైపు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న అమ‌రావ‌తి నిర్మాణం. ఇంకోవైపు త‌రుముకొస్తున్న 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు. ఇన్ని స‌మ‌స్య‌ల‌కు తోడు.. ఇప్పుడు తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌లు మ‌రో పెద్ద స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించింది చంద్ర‌బాబుకి!! నిజానికి సీనియ‌ర్లు అనుకున్న నేత‌లు సైతం రోడ్డున‌ప‌డి కుమ్మ‌లాట‌ల‌తో తీరిక‌లేకుండా పార్టీ ప‌రువును బ‌జారుకీడుస్తున్నారు!

వీరిలో కాక‌లు తీరిన తెలుగు దేశం యోధుల‌తో పాటు నిన్న‌గాక మొన్న సైకిలెక్కిన నేత‌లు కూడా ఉండ‌డం.. రోజు వారి స‌మ‌స్య‌ల‌కు తోడు వీరి పంచాయ‌తీల‌ను ప‌రిష్క‌రించ‌డం చంద్ర‌బాబుకు తీవ్ర త‌ల‌నొప్పుల‌కు కార‌ణ‌మౌతోంది. రాజ‌కీయంగా మ‌రో ముప్పై ఏళ్ల‌యినా ఏపీలో సీఎం పీఠాన్ని క‌రిచి పెట్టి కూర్చోవాల‌ని భావిస్తున్న చంద్ర‌బాబు.. ఇత‌ర పార్టీల నుంచి జంపింగ్‌ల‌ను ప్రోత్స‌హించారు. ఈ క్ర‌మంలో వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు చేర్చేసుకున్నారు. ముఖ్యంగా వైసీపీ ఖాళీ అయిపోతే.. త‌న‌కు ప్ర‌త్య‌ర్థులే ఉండ‌ర‌ని బాబు భావించారు.

ఇప్పుడు ఆ ఆలోచ‌నే బాబుకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. వైసీపీ నుంచి వ‌చ్చిన వారు.. స్థానికంగా ఉన్న టీడీపీ నేత‌ల‌తో క‌లిసిపోకుండా ఆధిప‌త్యం కోసం ఆరాట‌ప‌డ‌డం టీడీపీకి పెద్ద దెబ్బ‌గా ప‌రిణ‌మిస్తోంది. ఈ క్ర‌మంలోనే క‌ర‌ణం వ‌ర్సెస్ గొట్టిపాటి వ్య‌వ‌హారం రోడ్డు కెక్కింది. అదేస‌మ‌యంలో యువ మంత్రి భూమా కూతురు.. అఖిల ప్రియ చేసిన బ‌హిరంగ ప్ర‌క‌ట‌నతో క‌ర్నూలులో పార్టీ కేడ‌ర్‌కి తీవ్ర దెబ్బ‌కొట్టింది. అదేస‌మ‌యంలో మిగిలిన జిల్లాల్లోనూ ప‌రిస్థితి అంత ఆశాజ‌న‌కంగా లేదు.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ఆధిప‌త్య ధోర‌ణి చివ‌రికి ఆయ‌న‌ను హ‌త్య చేసేందుకు సుపారీ ఇచ్చేదాకా వెళ్లిందంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. విజ‌య‌వాడ‌లోనూ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే దూకుడుపై ఇప్ప‌టికే సీఎంవోకి పలు నివేదిక‌లు అందాయి. ఈ క్ర‌మంలో బాబుకు ఇప్పుడు అటు ప్ర‌భుత్వం, ఇటు పార్టీని కాపాడుకోవడం .. అంద‌రినీ స‌మ‌న్వ‌యం చేసుకుంటూ రావ‌డం పెద్ద స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించింది. మ‌రి ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ప‌డుతున్న టెన్ష‌న్ అంతా ఇంతా కాద‌నేది నిజం!!