సీఎం ర‌మేశ్ స్పీడ్ కు బాబు బ్రేక్

ఏపీలో అధికార టీడీపీలో రాజ‌కీయాలు ఎప్పుడూ లేనంత‌గా క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పిన‌ట్టే క‌నిపిస్తున్నాయి. చంద్ర‌బాబు గ‌తంలో సీఎంగా ఉన్న‌ప్ప‌టి కంటే ప్ర‌స్తుతం ఆయ‌న మాట‌ను ధిక్క‌రించే వాళ్లు రోజు రోజుకు ఎక్కువ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న మాట విన‌క‌పోతే త‌న‌కు ఎంత స‌న్నిహితులైన వారిని అయినా బాబు ప‌క్క‌న పెట్టేస్తూ వారికి షాకులు ఇస్తున్నారు. ఈ కోవ‌లోకే వ‌స్తారు రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం.ర‌మేశ్‌.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సీఎం.ర‌మేశ్‌కు చంద్ర‌బాబు ఇచ్చిన ప్ర‌యారిటీ అంతా ఇంతా కాదు. సీమ‌లో ఎన్నిక‌ల టిక్కెట్లు ఎవ‌రికి ఇవ్వాల‌న్నా ర‌మేశ్ చెప్పిందే వేదం. ర‌మేశ్ లింగారెడ్డి లాంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెట్టేసినా ఎవ్వ‌రూ కిమ్మ‌న‌లేదు. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక కూడా ర‌మేశ్ ప్ర‌యారిటీ ఓ రేంజ్‌లో ఉంది. అయితే త‌ర్వాత దూకుడుగా వ్య‌హ‌రిస్తుండ‌డంతో పాటు కేంద్ర మంత్రి సుజ‌నాచౌద‌రితో వైరం లాంటి అంశాల నేప‌థ్యంలో ర‌మేశ్ ప్ర‌యారిటీ బాబు బాగా త‌గ్గించేస్తూ వ‌స్తున్నారు.

తాజాగా జిల్లా పార్టీ అధ్య‌క్షుల ఎంపిక‌లో ర‌మేశ్ సొంత జిల్లాలో ఆయ‌న మాట అస్స‌లు చెల్లుబాటు కాలేదు. కడప జిల్లాలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ర‌మేశ్ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిని కొనసాగించ వద్దని అధిష్టానాన్ని కోరారు. ఆయనను తప్పించి కొత్తవారికి స్థానం కల్పించాలని కోరారు. అయితే చంద్ర‌బాబు మాత్రం ర‌మేశ్ మాట‌ను ప‌క్క‌న పెట్టేసి జిల్లాలో మెజార్టీ నాయ‌కుల అభిప్రాయం ప్ర‌కారం శ్రీనివాసులురెడ్డినే తిరిగి మ‌రోసారి అధ్య‌క్షుడిగా కంటిన్యూ చేశారు.

అస‌లు కార‌ణం ఇదే..!

ఇప్ప‌టి వ‌ర‌కు క‌డ‌ప జిల్లాను ర‌మేశ్ త‌న క‌నుసైగ‌ల‌తో శాసిస్తూ వ‌స్తున్నారు. అయితే ఇప్పుడు జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్న శ్రీనివాసులురెడ్డి ర‌మేశ్‌నే లెక్క చేయ‌డం లేదు. దీంతో ఆయ‌న్ను ఎలాగైనా త‌ప్పించాల‌ని ప్లాన్ చేసిన ర‌మేశ్ ఈ విష‌యంలో చంద్ర‌బాబుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే శ్రీనివాసులురెడ్డి ఇటీవ‌ల చంద్ర‌బాబును క‌లిసి ఇక్క‌డ ర‌మేశ్ ఒంటెద్దు పోక‌డ‌ల‌ను వివ‌రించారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా శ్రీనివాసులురెడ్డికే స‌పోర్ట్ చేయ‌డంతో ర‌మేశ్‌కు బాబు షాక్ ఇచ్చారు. దీనిని బ‌ట్టి జిల్లాలోను, చంద్ర‌బాబు వ‌ద్ద‌ ఆయ‌న ప్రాధాన్య‌త రోజు రోజుకు త‌గ్గుతూ వ‌స్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.