కాపు నేత‌తోనే ముద్ర‌గ‌డ‌కు చెక్‌

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రోసారి క‌దం తొక్కేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. చ‌లో అమ‌రావ‌తి అంటూ.. ప్ర‌భుత్వంపై శ‌మ‌ర శంఖం పూరించేందుకు సన్న‌ద్ధ‌మ‌వుతున్నారు. గ‌తంలోలా తమ ఉద్య‌మాన్ని అణిచివేసేందుకు ప్ర‌య‌త్నించినా.. ఈసారి మాత్రం వెన‌క‌డుగు వేసేది లేద‌ని బ‌ల్ల గుద్దిమరీ చెబుతున్నారు. ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాల‌న్నింటినీ ఆదిలోనే తొక్కేసిన సీఎం చంద్ర‌బాబు.. ఇప్పుడు కూడా అదే ప‌నిలో ప‌డ్డారు. ఈసారి కూడా ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌ను అడ్డుకోవాల‌నే దృఢనిశ్చ‌యంతో ఉన్నారు. కాపు నేతల‌కు స‌మాధానాలిచ్చేందుకు ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌నే రంగంలోకి దించారు. ఆయ‌న ద్వారా ముద్ర‌గ‌డ‌ను టార్గెట్ చేయిస్తున్నారు.

ముద్ర‌గ‌డ‌, చంద్ర‌బాబు మ‌ధ్య మరోసారి వార్ జ‌ర‌గ‌బోతోంది. కాపుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని సీఎం చంద్ర‌బాబును తీవ్రంగా విమ‌ర్శిస్తూ.. లేఖ‌ల మీద లేఖ‌లు రాసిన ముద్ర‌గ‌డ‌.. 26న‌ పాద‌యాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ యాత్ర‌ను ఎలాగైనా అణిచివేయాల‌ని సీఎం చంద్ర‌బాబు పంతం ప‌ట్టారు. గ‌తంలో ముద్ర‌గ‌డ చేసిన యాత్ర‌ల‌ను స‌మ‌ర్థంగా వాయిదా వేసేలా చేసిన ఆయ‌న‌.. ఈసారి కూడా ఇదే ప‌నిలో ప‌డ్డారు. కాపు ఉద్యమంతో ప్రభుత్వానికి, పార్టీకి జరిగిన, జరుగుతున్న డ్యామేజీని కంట్రోల్ చేయడానికి ఈసారి చంద్రబాబు ఉద్యమంపై ఉక్కు పాదం మోపాలని డిసైడయ్యారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్న ఉద్దేశంతో డిప్యూటీ సీఎం చిన రాజప్పను రంగంలోకి దించారు.

ముద్రగడను ఢీకొనేందుకు మరో కాపునేతనే బరిలోకి దించడం ద్వారా చంద్రబాబు గోల్ సెట్ చేసేశారు. ముద్రగడ ఏం మాట్లాడినా సరే వెంట‌నే దానిని ఖండించడమే పనిగా పెట్టుకున్నారు చిన రాజప్ప. కాపుల అసలైన నేత, కాపు కాసే నేత చంద్రబాబేనని డంకా బజాయించి మరీ చెబుతున్నారు. ముద్రగడ పాదయాత్ర చేస్తాననగానే అదేం కుదరదని, దానిని అడ్డుకుంటామని తీవ్రంగా స్పందించారు. అడ్డంకులు కల్పించినా పాదయాత్ర ఆగదని ముద్రగడ తెగేసి చెబు తున్నారు. అడుగు ముందుకు పడినప్పుడు కదా అని సవాల్ విసురుతున్నారు చినరాజప్ప. అంతగా చేయాలను కుంటే ముందో దరఖాస్తు పెట్టండి పరిశీలిస్తామంటున్నారు.

గతంలో చంద్రబాబు, వైఎస్ ఇలా అనుమతి తీసుకునే చేశారా? అంటూ ముద్ర‌గ‌డ ప్రశ్నిస్తున్నారు. ఇలా స‌వాళ్లు- ప్ర‌తిసవాళ్లు, ఆరోప‌ణ‌లు-ప్ర‌త్యారోప‌ణ‌లు, ఆరోప‌ణ‌లు-విమ‌ర్శ‌లు చేసుకుంటూ ఉంటే.. చంద్ర‌బాబు మాత్రంన వెన‌కే ఉండి.. ఏం జ‌రుగుతుందో అని చూస్తున్నారు. అయితే ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్థించాల్సిన ప్ర‌తిపక్షం.. ముద్ర‌గ‌డ యాత్ర‌కు మ‌ద్దతు ప‌ల‌కడం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మొత్తానికి ముద్ర‌గ‌డ‌ను టార్గెట్ చేయ‌డానికి చంద్ర‌బాబు కాపు నేత‌నే రంగంలోకి దించ‌డం, వాళ్ల‌తోనే కౌంటర్లు ఇప్పించ‌డం.. ఆయ‌న చ‌తుర‌త‌కు నిద‌ర్శ‌న‌మే!!