బాబు వ్యూహం బెడిసి కొడుతోందా?!

ఒక్కొక్క సారి మ‌నం తీసుకునే నిర్ణ‌యాలు అనూహ్యంగా మ‌న‌కే ప‌రీక్ష పెడుతుంటాయి! ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌స్తుతం ఏపీలో సీఎం సీటులో కూర్చున్న ఆయ‌న ఏ ముహూర్తాన‌.. ఇదే సీటులో మ‌రో ముప్పై ఏళ్ల‌పాటు శాశ్వ‌తంగా కూర్చోవాల‌ని డిసైడ్ చేసుకున్నారో ఏమోగాని.. ఆ క్ష‌ణం నుంచి ఆయ‌న అనేక వ్యూహాల‌కు తెర‌దీశారు. ప్ర‌ధానంగా రాష్ట్రంలో విప‌క్షాన్ని లేకుండానే చేయ‌డం ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాల‌ని వ్యూహం ర‌చించారు. కొన్ని సంద‌ర్భాల్లో.. బ‌హిరంగ స‌భ‌ల్లో మాట్టాడుతూ.. ఈ రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం అవ‌స‌ర‌మా త‌మ్ముళ్లు! అంటూ ప్ర‌శ్నించారు కూడా.

దీనిలో భాగంగానే విప‌క్ష నేత‌ల‌కు గాలం విసిరారు. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు.. స్థాయిల‌తో సంబంధం లేకుండా సైకిలెక్కించేసుకున్నారు. అడిగిన వారికి అడిగిన‌ట్టు హామీలు గుప్పించారు. మంత్రి ప‌ద‌వుల నుంచి చైర్మ‌న్ గిరీల వ‌ర‌కు వ‌రాల వ‌ర్షం కురిపించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఇలా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారివ‌ల్ల‌.. అస‌లుకే ఎస‌రు వ‌స్తున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది!

తాజా క‌ర్నూలు ఘ‌ట‌న‌, కొన్ని రోజుల కింద‌ట క‌ర‌ణం వ‌ర్సెస్ గొట్టిపాటి ఘ‌ట‌న‌లు చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. ఈ రెండు ఘ‌ట‌న‌ల్లోనూ వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారు సైకిల్ ప‌రువును బ‌జారుకు ఈడ్చేశార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. యువ మంత్రి, భూమా అఖిల ప్రియ త‌న అనుభ లేమి త‌నాన్ని ప్ర‌ద‌ర్శించి.. త‌న త్ండ్రి సీటును త‌మ కుటుంబానికే కేటాయిస్తున్నార‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌డంతో.. టీడీపీ తీవ్రంగా న‌ష్ట‌పోయింది.

ఇక‌, క‌ర‌ణం, గొట్టిపాటి వ‌ర్గాలు రోడ్ల‌మీదే క‌ర్ర‌ల‌తో దాడులు చేసుకుని త‌లలు ప‌గ‌ల‌కొట్టుకున్నాయి. దీనిపై చంద్ర‌బాబు వార్నింగ్‌లు ఇవ్వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, మిగిలిన జిల్లాల్లోనూ ప‌రిస్థితి ఏమంత ఆశాజ‌న‌కంగా లేదు. విజ‌య‌వాడ పశ్చిమ విష‌యానికి వ‌స్తే.. మంత్రి ప‌ద‌విని ఆశ‌చూపి వైసీపీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌ను పార్టీలో చేర్చుకున్నారు.

అయితే, ప‌ద‌వి ఇవ్వ‌కుండా ఆయ‌న‌కు మొండి చేయి చూపారు. అప్ప‌టి వ‌ర‌కు యాక్టివ్‌గా జ‌గ‌న్‌ను తిట్టిపోసిన‌.. జ‌లీల్ ప‌ద‌వి రాక‌పోయే స‌రికి.. తిరిగి ఎప్పుడెప్పుడు జ‌గ‌న్ నుంచి పిలుపు వ‌స్తుందా? అని ఎదురు చూస్తున్న‌ట్టు మైనార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. సో.. చంద్ర‌బాబు ప‌రిస్థితి.. తో టీడీపీ పార్టీకే ఎస‌రు వ‌స్తోంద‌నే క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. మ‌రి 2019లోపు ఇంకెన్ని సిత్రాలు వెలుగులోకి వ‌స్తాయో చూడాలి.