నంద‌మూరి కుటుంబాన్ని వ‌దిలేస్తే.. బాబుకు క‌ష్ట‌మే!!

నంద‌మూరి కుటుంబానికి, టీడీపీ సీఎం చంద్ర‌బాబుకి మ‌ధ్య దూరం పెరుగుతోందా? ముఖ్యంగా టీడీపీకి 2009లో భారీ ఎత్తున ప్ర‌చారం చేసి పెట్టిన ఎన్టీఆర్ మ‌న‌వ‌డు, జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌ని సైతం బాబు దూరం పెడుతున్నారా? భ‌విష్య‌త్తులో వారితో అవ‌స‌రం లేద‌ని బాబు భావిస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి ఆలోచ‌న‌లే వ‌స్తున్నాయ‌ట టీడీపీ కేడ‌ర్‌లో! దీనికి ప్ర‌ధాన కార‌ణం.. నిన్న విశాఖ కేంద్రంగా ప్రారంభ‌మైన మ‌హానాడేన‌ని చ‌ర్చిస్తున్న‌వారు చెబుతున్నారు.

మ‌రి విష‌యం ఏంటో చూద్దాం.

టీడీపీ మ‌హానాడు శ‌నివారం విశాఖ‌లో ఘ‌నంగా మొద‌లైంది. దీనికి అన్ని వ‌ర్గాల పార్టీ వారినీ ఆహ్వానించారు. అదేస‌మ‌యంలో ఎన్‌టీఆర్ వార‌సులు, నంద‌మూరి వంశానికి చెందిన వారు ఏ ఒక్క‌రూ ఈ కార్య‌క్ర‌మంలో క‌నిపించ‌లేదు. హిందూపురం ఎమ్మెల్యే, బాబు వియ్యంకుడు బాల‌కృష్ణ‌, అన్న‌గారి పెద్ద కుమారుడు.. ఒక్క మ‌గాడు హ‌రికృష్ణ కానీ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాలేదు. అంతేనా? 2009లో టీడీపీకి భారీ ఎత్తున ప్ర‌చారం చేసిన జూనియ‌ర్ ఎన్‌టీఆర్ సైతం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీనిపైనే తెలుగు దేశం నేత‌లు చెవులు కొరుక్కున్నారు.

బాల‌కృష్ణ‌కి ఆహ్వానం అందించినా.. సినిమా షూటింగ్‌లో ఉండ‌డంతో వీలుకాలేద‌ని అంటున్నారు. ఇక‌, హ‌రికృష్ణ విష‌యానికి వ‌చ్చేస‌రికి ఆయ‌న‌కు ఆహ్వానం అందినా.. మ‌న‌స్ఫూర్తిగా కార్య‌క్ర‌మానికి పిలిచి ఉండ‌ర‌ని, మొక్కుబ‌డిగానే ఇన్వైట్ చేసి ఉంటార‌ని అందుకే ఆయ‌న డుమ్మా కొట్టి ఉంటార‌ని అంటున్నారు.ఇక‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ విష‌యానికి వ‌చ్చే స‌రికి.. గ‌త కొన్నాళ్లుగా మేన‌మామ‌(చంద్ర‌బాబు), మేన‌ల్లుడు(ఎన్‌టీఆర్‌)ల మ‌ధ్య పొస‌గ‌డం లేద‌ని అందుకే పిలిచి ఉండ‌ర‌ని అంటున్నారు.

అయితే, ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న పొలిటిక‌ల్ విశ్లేష‌కులు మాత్రం.. ఇది బాబుకి, ఆయ‌న పార్టీకి మంచిది కాద‌ని కంక్లూజ‌న్‌కి వ‌చ్చారు. నంద‌మూరి వంశానికి ఉభ‌య గోదావ‌రి జిల్లాలు స‌హా కృష్ణా, గుంటూరుల్లో భారీ ఎత్తున అభిమానులు ఉన్నార‌ని, ముఖ్యంగా జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని, 2019లో రాష్ట్రంలో జ‌రిగే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌, వైసీపీల‌ను ఎదుర్కుని, పార్టీని అధికారంలోకి తేవాలంటే.. నంద‌మూరి ప‌వ‌ర్‌ని వాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. మ‌రి బాబు ఆదిశ‌గా ఆలోచించ‌కుండా ఇలా దూరం పెట్ట‌డం స‌రికాద‌ని అంటున్నారు. మ‌రి బాబు వ్యూహం ఏంటో చూడాలి!!