ఆ ఇద్ద‌రు మంత్రుల‌పై వేటు త‌ప్ప‌దా!

నంద్యాల ఉప ఎన్నికల్లో త‌ల‌మున‌క‌లై ఉన్న సీఎం చంద్ర‌బాబుకు ఏపీ మంత్రులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్ప‌టికే గంటా శ్రీ‌నివాస‌రావు, అయ్య‌న్న‌పాత్రుడు మ‌ధ్య వివాదాలు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. అవి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ఉన్న స‌మస్య‌ల‌కు తోడు ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు మంత్రులు కూడా ఈ జాబితాలో చేరిపోయార‌ట‌. ఒక మ‌హిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర విచార‌ణ ఎదుర్కొంటుండ‌గా.. మ‌రొక‌రు మ‌నీలాండ‌రింగ్ వ్య‌వ‌హారాలు చ‌క్క‌దిద్దుకునేందుకు విదేశీటూర్లు చేస్తున్నార‌ట‌. నంద్యాల ఎన్నిక పూర్త‌యిన త‌ర్వాత‌.. వీరిద్ద‌రిపై ఏదో ఒక చ‌ర్య తీసుకోవ‌చ్చ‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

ఏపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల వ్యవహార శైలితో ముఖ్యమంత్రి తరచూ చిక్కుల్లో పడుతున్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఇద్దరు మంత్రుల వ్యవహార శైలి పిఎంఓ వరకు చేరింది. ఒకరు సీనియర్‌ అధికారితో అనుచితంగా ప్రవర్తిస్తే., మరొకరు తరచూ విదేశీ పర్యటనల వెనుక మర్మమేమిటో నిఘా వర్గాలు గుర్తించి సీఎం చంద్ర‌బాబుకు నివేదిక కూడా అంద‌జేశాయ‌ని స‌మాచారం. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయలేనంటూ ఇటీవల ఓ ఉన్నతాధికారిణి కేంద్ర సర్వీసుకు వెళ్ళిపోయేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అంతకు ముందు కొన్ని అవాంఛనీయ ఘటనలు జరగడంతోనే ఆమె మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

రెండు కీలక శాఖలకు కార్యదర్శిగా ఉన్న అధికారిణితో.. ఆ శాఖ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న మంత్రి అనుచితంగా ప్రవర్తించార‌ట‌. దీంతో తీవ్ర‌ మనస్తాపానికి గురైన ఆమె.. ఈవిష‌యంపై ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేశార‌ట‌. అయితే సీఎంవో నుంచి ఎటువంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌కు ఫిర్యాదు చేశారు. శాఖపరమైన సమావేశంలో సదరు మంత్రి తనతో అసభ్యంగా ప్రవర్తించారని కేంద్రానికి వివ‌రించార‌ట‌. దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్ర‌స్తుతం విచారణ జరుపుతోంది. ఇక ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మరో మంత్రి తరచూ విదేశీ పర్యటనలు జరపడంపై ఇంటెలిజెన్స్‌ బ్యూరో వర్గాలు ఏడాది కాలంగా ఆరా తీస్తున్నాయి.

యుకె, యూరోప్‌ పర్యటనల్లో ఏం జరుగుతుందనే విషయాలపై భాగస్వామ్య దేశాలతో కలిపి సమాచారాన్ని సేకరించాయ‌ట‌. మనీలాండరింగ్‌, ఇతర చట్ట విరుద్ధమైన పనులపై సందేహాలు తలెత్తడంతో ఐబీ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. ఈ సమాచారం ముఖ్యమంత్రికి తెలియచేయడంతో పాటు పీఎంవోకు కూడా అందచేశారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే! దీంతో పాటు ఈ రెండు విష‌యాలు కూడా వెలుగులోకి వ‌స్తే.. ప్ర‌తిప‌క్ష దాడి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. దీంతో నంద్యాల ఉప ఎన్నిక త‌ర్వాత ఈ మంత్రుల‌పై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశాలు ఖాయంగా కనిపిస్తోంది!!