తొందరపడొద్దు భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ గురించి ఆలోచిద్దాము

తెలంగాణ పాలిటిక్స్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర‌ను సంపాదించుకున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఆ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబే పొలిటిక‌ల్‌గా అణ‌గ‌దొక్కుతున్నార‌ట‌! ఇప్పుడు దీనిపైనే తెలంగాణ‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వానికి చంద్ర‌బాబు ఏపీకి ప‌రిమిత మైన నేప‌థ్యంలో తెలంగాణ‌లో కేసీఆర్‌కు దీటుగా టీడీపీ త‌ర‌ఫున మాట్లాడుతున్న ఏకైక వ్య‌క్తి రేవంత్ అని ఒప్పుకోక త‌ప్ప‌దు. దీంతో కేసీఆర్‌కి మొగుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది రేవంతే అనే టాపిక్ పుట్టింది.

ఈ నేప‌థ్యంలో 2019 ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ని బ‌లంగా ఎదుర్కొనేందుకు టీడీపీ త‌ర‌ఫున త‌న వంతుగా అన్ని ప్ర‌య‌త్నాలూ ముమ్మ‌రం చేశాడు రేవంత్. ఈ లైన్‌లోనే ఆయ‌న విప‌క్షాలతో క‌లిసి వారు చేప‌డుతున్న ఉద్య‌మాల్లోనూ పాల్గొంటున్నారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి ప్ర‌జా సంఘాలు, ఉద్య‌మ‌కారుల‌ను ఒక వేదిక మీద‌కు తీసుకువ‌చ్చి స‌రికొత్త నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని రేవంత్ ప్లాన్ చేశాడు.

అదే స‌మ‌యంలో బీజేపీతో దోస్తానాపైనా రేవంత్ స్కెచ్ సిద్ధం చేశాడు. వామ‌ప‌క్షాల‌ను సైతం క‌లుపుకొని టీఆర్ ఎస్‌ని ఓడించాల‌ని ప్లాన్ సిద్ధం చేశాడు. ఇలా త‌న జెట్ స్పీడ్‌తో దూసుకుపోయి.. తెలంగాణ‌లో టీ డీపీని నిల‌బెట్టాల‌ని రేవంత్ ప‌క్కా ప్లాన్‌తో ముందుకు పొతున్నాడు. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల తెలంగాణ‌లో మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌పై సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి వివ‌రించాడు రేవంత్‌. త‌న ప్లాన్‌కి టీడీపీ అధ్య‌క్షుడు మురిసిపోతాడ‌ని రేవంత్ భావించాడు.

అయితే, అనుకున్న‌దొక్క‌టి.. అయిన‌ది ఒక్క‌టి అన్న‌ట్టుగా చంద్ర‌బాబు.. రేవంత్ ప్లాన్‌ని మొగ్గ‌లోనే తుంచేశార‌ట‌. టీఆర్ ఎస్‌కు ప్ర‌త్యామ్న‌యంగా టీడీపీని త‌యారు చేయాల‌ని అప్ప‌టి దాకా తొంద‌ర ప‌డొద్ద‌ని హెచ్చ‌రించార‌ట‌. బీజేపీ విష‌యంలో అమిత్ షా ఏమంటారో చూసాక అప్పుడు భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ గురించి ఆలోచించ‌వ‌చ్చ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసాడ‌ట‌. దీంతో రేవంత్ వ‌ర్గం తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయింద‌ని టాక్‌.