2019పై బాబు ప‌ట్టు.. మూడు `పీ`ల‌తో ముందుకు!

ల‌క్ష్యం ఉండ‌డం ఒక ఎత్తు.. ఆ లక్ష్యాన్ని సాధించే మార్గం అనుస‌రించ‌డం మ‌రో ఎత్తు! ఈ రెండూ జ‌త‌కలిస్తేనే విజ‌యం చేరువ‌య్యేది. ఈ సూత్రాన్ని గ‌ట్టిగా తెలిసిన, మ‌రింత గ‌ట్టిగా న‌మ్మిన నాయ‌కుడు చంద్ర‌బాబు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఆయ‌న మ‌రింత సీరియ‌స్‌గా ఫాలో అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 2019 ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డ‌మే కాదు.. మ‌రో 50 ఏళ్ల పాటు అధికారంలోనే ఉండాల‌ని స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాల‌ను నిర్ణ‌యించుకున్న బాబు.. నాలుగు గోడ‌ల మ‌ధ్య కూర్చుని క‌ల‌లు క‌న‌డం లేదు. వీటిని సాధించేందుకు నిరంత‌రం కృషి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మ‌రో వినూత్నమైన ఫార్ములాను అనుస‌రించేందుకు రంగం సిద్ధం చేశారు.

నిఖార్స‌యిన నాయ‌కుడు తాను ప‌నిచేయ‌డంతోపాటు త‌న ప‌రివారాన్నీ స‌మ‌ర్థంగా వినియోగించుకుంటాడ‌నేది నానుడి. ఇప్పుడు దీనిని అక్ష‌రాలా రుజువు చేస్తున్నారు చంద్ర‌బాబు. మూడు..పీ-ల స్ట్రాట‌జీతో బాబు ముందుకు పోవాల‌ని డిసైడ్ అయ్యారు. అవేంటో చూద్దాం.. ఒకటి పబ్లిక్ మేనేజిమెంట్, రెండు పొలిటికల్ మేనేజిమెంట్, మూడు పోల్ మేనేజ్ మెంట్. ఈ మూడు మేనేజ్‌మెంట్‌ల‌ను పక్కాగా ఫాలో అయితే టీడీపీదే శాశ్వత అధికారం అని బాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశ‌గా పార్టీని, త‌మ్ముళ్ల‌ను న‌డిపించేందుకు కార్యాచ‌ర‌ణ సైతం సిద్ధం చేశారు.

నిన్న జ‌రిగిన టీడీపీ నాయకత్వ శిక్షణా శిబిరంలో ఈ మూడు పీల గురించి సంపూర్ణంగా వివ‌రించిన బాబు.. త‌మ్ముళ్ల‌కు ల‌క్ష్యాన్ని నిర్దేశించారు. ప్రజల్లో సంతృప్తి తీసుకురావడం పబ్లిక్ మేనేజిమెంట్ అయితే, వచ్చిన సంతృప్తిని పార్టీకి అనుకూలంగా మలుచుకోవడం పొలిటికల్ మేనేజిమెంట్ అని, ప్రజల్లో సంతృప్తిని ఓట్లరూపంలో పార్టీకి మళ్లించడమే పోల్ మేనేజ్ మెంట్ అని వివ‌రించారు. ఈ మూడింటిని అమలు చేసినందువల్లే నంద్యాల ఉపఎన్నికలో, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలో అద్భుత ఫలితాలు సాధించగలిగిన‌ట్టు తెలిపారు. రాబోయే 2019 స‌హా ఏ ఎన్నిక వ‌చ్చినా ఈ మూడు పీల‌ను దృష్టిలో ఉంచుకునే పార్టీ అడుగులు వేస్తుంద‌న్నారు.

గత మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఏ కులానికి ఏమి చేశామో స్పష్టంగా, విశదంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినందునే నంద్యాల, కాకినాడ ఫలితాలు టీడీపీ ఏకపక్షం గా మారాయ‌ని చెప్పారు. గతంలో దూరమైన మైనార్టీ వర్గాలు కూడా ఈ ఎన్నికల్లో టీడీపీకి దగ్గర కావడం ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ని చెప్పారు. కాకినాడలో రెబల్స్ తో కలిపి 56% ఓట్లు వచ్చాయని, 80% డివిజన్లు టీడీపీకి కైవసం అయ్యాయని, ఇదే జోరు కొనసాగిస్తే 2019 ఎన్నికలో 95% సీట్లు టీడీపీ కైవసం చేసుకుని రాష్ట్రంలోని 175 స్థానాల‌నూ కొల్ల‌గొట్ట‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. మ‌రి బాబు ప్లాన్ ఎంత‌మేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి .