చంద్ర‌బాబును ముంచేస్తున్న ట్రాన్స్‌స్ట్రాయ్‌

September 13, 2017 at 1:35 pm
chandra babu, polavaram, trans troy

పోల‌వ‌రం.. పోల‌వ‌రం.. పోల‌వ‌రం.. ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం వ‌ల్లెవేసే ప‌దం! పోలవ‌రం ఏపీ జీవ‌నాడి అని సంద‌ర్భం దొరికిన‌ప్పుడ‌ల్లా చెబుతూ ఉంటారు! పోల‌వ‌రం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తిచేయాల‌ని ప‌దేప‌దే అధికారుల‌ను ఉరుకులు, ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒక‌వైపే అని తేలిపోయింది. పోల‌వ‌రం కాంట్రాక్టు ప‌నులు ద‌క్కించుకున్న ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ.. ఇప్పుడు చంద్ర‌బాబును పూర్తిగా ముంచేసింది. పోలవ‌రం ప‌నుల్లో తీవ్ర జాప్యం ఇప్పుడు చంద్ర‌బాబుకు నిద్ర‌లేకుండా చేస్తోంది. అనుకున్న స‌మయానికి పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్త‌వుతుందో లేదో అనే టెన్ష‌న్ రోజులు గ‌డుస్తున్న కొద్దీ ఆయ‌న‌లో పెరుగుతోందట‌.

ఓ వైపు ట్రాన్స్ స్ట్రాయ్.. మరో వైపు కేంద్రం. సోమవారం పేరును పోలవారంగా మార్చి ఈ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నా అని నిన్నటి వరకూ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పింది అబద్దమే అని తేలిపోయింది. ట్రాన్స్ స్ట్రాయ్ కు నోటీసులు ఇచ్చింది కూడా అంతా తూచ్ అని తేలిపోయింది. నోటీసులు లేవు.. కాంట్రాక్ట్ రద్దు లేద‌ని స్ప‌ష్ట‌మైంది.

మరి పోలవరంలో ముందడుగు ప‌డేదెలా? ఇప్పుడిదే చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారింది. ట్రాన్స్ స్ట్రాయ్ ను అలాగే పెట్టి ఓ బడా కాంట్రాక్టర్ కు పని అప్పగిద్దామని చూస్తే.. ఆ కంపెనీ పేరు మీద ఉన్న పని తాను చేయనని తేల్చిచెప్పేశాడట. కొత్తగా టెండర్ పిలిస్తే ఓకే..లేదంటే నాతో కాదు అన్నది ఆ కాంట్రాక్టర్ ఫైనల్ మాట.

ట్రాన్స్ స్ట్రాయ్ కు నోటీసులు ఇచ్చి..టెండర్ రద్దు చేస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళుతుంది. కేంద్రం ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) నే కొత్త టెండర్ తో పాటు ప్రాజెక్టు పనులను పర్యవేక్షి స్తుంది. అది చంద్రబాబుకు ఏ మాత్రం ఇష్టం లేని పని. ఎందుకంటే కేంద్రం ఎంట‌రైతే.. క్రెడిట్ అంతా కేంద్రానికే ద‌క్కుతుంది! మరి ట్రాన్స్స్ స్ట్రాయ్ ను తప్పించకుండా పని జరిగేది ఎలా అనే అంశంపై సీఎం చంద్రబాబు సన్నిహితులు తర్జనభర్జనలు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా చంద్రబాబే స్వయంగా పూనుకుని కొంత మంది సబ్ కాంట్రాక్టర్లను పెట్టి నడిపించినా పని పెద్దగా ముందుకు కదిల‌లేదు.

ఓ వైపు 2018 చివరి నాటికి కాప‌ర్ డ్యామ్ పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని పదే పదే ప్రకటిస్తున్నారు. పరిస్థితి చూస్తే మాత్రం దారుణంగా ఉంది. మొత్తానికి చంద్రబాబు `పోలవరం`లో చిక్కుకుపోయారని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేసి ఇచ్చేదని తెలిపారు. సాగునీటి శాఖలో ఏ అధికారిని అడిగినా ట్రాన్స్ స్ట్రాయ్ ఈ ప్రాజెక్టు పూర్తి చేయలేదనే చెబుతున్నారు. మ‌రి అలాంటి కంపెనీని మార్చేందుకు చంద్ర‌బాబు సాహ‌సం చేయ‌లేకపోతున్నారు!!

 

చంద్ర‌బాబును ముంచేస్తున్న ట్రాన్స్‌స్ట్రాయ్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts