చంద్ర‌బాబు జోరు… జ‌గ‌న్ బేజారు!

ఏపీలోని రెండు ప్ర‌ధాన పార్టీలు అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీల మ‌ధ్య ఇప్పుడు విచిత్ర వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అధికార పార్టీ సాధార‌ణంగా జోరు మీదుండ‌డం స‌హ‌జం. అయితే, ఇప్పుడు ఆ పార్టీ జోరుతో పాటు మ‌రింత హుషారుగా కూడా ఉంది. ముఖ్యంగా మొన్న జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఫ‌లితాల అనంత‌రం టీడీపీలో పెద్ద ఎత్తున కొత్త ఆక్సిజ‌న్ అందింది. దీంతో అధినేత చంద్ర‌బాబు స‌హా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా చాలా హుషారుగా క‌నిపిస్తున్నారు. ఇక‌, ప్ర‌ధాన‌, ఏకైక విప‌క్షం వైసీపీ మాత్రం మ‌రింత‌గా కుంగిపోయింది. నిజానికి విప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి.. అధినేత అనేక కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు కాబ‌ట్టి.. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న స‌హ‌జం.

అయితే, నంద్యాల ఉప పోరు, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల త‌ర్వాత వైసీపీలో మ‌రింత‌గా బేజారు క‌నిపిస్తోంది. నంద్యాల ఎన్నిక‌ల‌కు ముందు గంట‌కోసారి ప్రెస్ మీట్ పెట్టి.. అరగంట‌కోసారి ప్రెస్ నోట్ విడుద‌ల చేసిన నేత‌లు రిజ‌ల్ట్ అనంత‌రం మీడియాకు దూర‌మైపోయారు. ఇక‌, తాజాగా చంద్ర‌బాబు పార్టీ నేత‌లు, ఎమ్మెల్యేల‌తో క‌లిసి నిర్వ‌హించిన వ‌ర్క్ షాపు కూడా టీడీపీలో జోష్ పెంచింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వేడిమీద ప‌రిస్థితిని చ‌క్క‌బెట్టుకోవాల‌ని, కాకినాడ‌, నంద్యాల ఫ‌లితాలు టీడీపీకి అనుకూలంగా వ‌చ్చిన నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో టీడీపీ ప‌ట్ల నెల‌కొన్న స‌ద‌భిప్రాయాన్ని ఇప్పుడే అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని బాబు త‌న ప‌రివారానికి బోధించారు.

ఈ క్ర‌మంలోనే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను 2019లో కాకుండా 2018లోనే నిర్వ‌హించ‌డంపై ఉప్పందించారు. ఇలా చేయ‌డం వ‌ల్ల టీడీపీ తిరిగి అధికారం నిల‌బెట్టుకోవ‌డం ఖాయ‌మ‌ని బాబు చెప్పారు. ఇక‌, ఇదే వార్త వైసీపీ నేత‌ల గుండెల్లో రైళ్ల‌ను ప‌రిగెట్టిస్తోంది. ముంద‌స్తుకు వెళ్లే ఓపిక లేక‌పోవ‌డం స‌హా నంద్యాల‌, కాకినాడల దెబ్బ నుంచి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఇంకా కోలుకోలేదు. మ‌రోప‌క్క ఎవ‌రు ఎప్పుడు గోడ దూకుతారో అని అధినేత జ‌గ‌న్ ఆప‌శోపాలు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ముంద‌స్తు అంటే.. క‌ష్ట‌మ‌నే వ్యాఖ్య‌లు వైసీపీలో వినిపిస్తున్నా. సో.. ఇప్పుడు టీడీపీ జోష్‌తో జోరుమీదుండ‌గా.. వీసీపీ.. నిరాశ‌తో నిస్స‌త్తువలో మునిగిపోయి ఉండ‌డం గ‌మ‌నార్హం.