మూడు సార్లు లేని టెన్ష‌న్‌..బాబుకు ఇప్పుడెందుకో..!

రాజ‌కీయ దురంధ‌రుడిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్పుడు అనుక్ష‌ణం తెగ టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం నంద్యాల ఉప ఎన్నిక‌! ఇప్ప‌టి వ‌ర‌కు దీనికి ఎలాంటి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కాలేదు. అయిన‌ప్ప‌టికీ.. బాబు మాత్రం అభ్య‌ర్థిని కూడా ప్ర‌క‌టించేశారు. అంత‌టితో ఆగ‌కుండా.. నియోజ‌క‌వ‌ర్గాన్ని మినీ రాజ‌ధానిగా మార్చేశారు. అంటే.. నిత్యం మంత్రులు అక్క‌డే ఉంటూ.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటార‌న్న‌మాట‌. అయిన‌ప్ప‌టికీ.. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపు మాత్రం అంత‌వీజీ కాద‌ని ఇంటిలిజెన్స్ నివేదిక‌లు అంద‌డం వ‌ల్లే.. బాబు ఇప్పుడు తెగ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ని స‌మాచారం.

నంద్యాల నుంచి వైసీపీ త‌ర‌ఫున గెలిచిన భూమా నాగిరెడ్డి.. త‌ర్వాత మంత్రి ప‌ద‌విపై ఆశ‌తో బాబు చెంత‌కు చేరారు. అయితే, అనూహ్యంగా హ‌ఠాన్మ‌రణం చెందారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జర‌గ‌నుంది. అయితే, గ‌తంలోనూ రాష్ట్రంలో మూడు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆళ్ల‌గ‌డ్డ‌(శోభా నాగిరెడ్డి మృతితో), నందిగామ‌(తంగిరాల ప్రభాకర్ మృతితో), తిరుపతి(ఎమ్మెల్యే వెంకటరమణ) మృతితో ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. అప్ప‌ట్లో వీటి విష‌యంలో చంద్ర‌బాబు ఇంత‌గా టెన్ష‌న్ ప‌డ‌లేదు.

అయితే, ఇప్పుడు మాత్రం తీవ్రంగా టెన్ష‌న్ ప‌డుతున్నారు. దీనికి కార‌ణం చూస్తే.. అప్ప‌ట్లో వాటి విష‌యంలో ప్ర‌ధాన విప‌క్షం.. వైసీపీ స‌ర్దుకుపోయి.. పోటీని ఏక‌ప‌క్షం చేసింది. కానీ, ఇప్పుడు మాత్రం నంద్యాల త‌మ‌దేన‌ని, త‌మ అభ్య‌ర్థినే నిల‌బెడ‌తామ‌ని భీష్మించింది. నిజానికి పైన చెప్పుకొన్న‌ట్టు భూమా వైసీపీ త‌ర‌ఫునే గెలిచి మ‌ర‌ణించాడు కాబ‌ట్టి.. వైసీపీకే హ‌క్కు ఉంటుంది. ఈ విష‌యంలోనే బాబు దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఇది త‌న మూడేళ్ల పాల‌న‌కు రెఫ‌రెండంగా కూడా ఆయ‌న భావిస్తున్నారు. దీంతో మంత్రులంద‌రినీ అక్క‌డ డంప్ చేసి.. అభివృద్ధి చేప‌డుతున్నారు.

ఇప్ప‌టికే రాత్రి ప‌గ‌లు.. మునిసిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ నంద్యాల‌లోనే తిష్ట‌వేసి పారిశుధ్యాన్ని గ‌మ‌నిస్తున్నారు. తాజాగా బుధ‌వారం సీఎం సొంతంగా వివిధ ప‌నుల‌కు శ్రీకారం చుట్ట‌నున్నారు. ఇదంతా కూడా ఎన్నిక‌ల్లో గెలుపుకోస‌మే నంటున్నారు విశ్లేష‌కులు. ఇక్క‌డ ఇప్పుడు బాబు జెండా ఎగిరి, సైకిల్ తిర‌గ‌క పోతే.. ఆయ‌న పాల‌న‌కు చెడ్డ పేరు ఖాయ‌మ‌నే చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే బాబు విప‌రీత‌మైన టెన్ష‌న్ ప‌డుతున్నార‌ని అంటున్నారు. మ‌రి బాబు ప్ర‌య‌త్నం ఏమ‌వుతుందో చూడాలి.