బాబు లిస్టులో ఆ ఇద్దరు మంత్రులకు లీస్ట్ ర్యాంకులు

ఏపీ సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఈ మూడేళ్ల‌లో ప‌లుసార్లు అటు మంత్రుల‌కు, ఇటు ఎమ్మెల్యేల‌కు ర్యాంకులు ఇస్తూ వారి ప‌నితీరు విష‌యాన్ని వారికి ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇక తాజాగా మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న త‌ర్వాత పాత‌వారిలో కొంత‌మందిని త‌ప్పించి కొత్త వారికి చోటు క‌ల్పించిన చంద్ర‌బాబు ఈ ప్ర‌క్షాళ‌న త‌ర్వాత ఓ ఇద్ద‌రు మంత్రుల‌పై నో ఇంట్ర‌స్ట్ అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న చ‌ర్చ‌లు ఆ పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

ఏపీలోని ఇద్దరు ఉపముఖ్యమంత్రుల్లో ఒకరైన కేఈ కృష్ణమూర్తిని చంద్రబాబు పూచిక‌పుల్ల‌లా తీసి వేస్తున్నార‌న్న టాక్ ఈ మూడేళ్ల నుంచి ఉంది. కేఈకి చంద్ర‌బాబుకు అస్స‌లు పొస‌గ‌క పోవ‌డంతో ఆయ‌న్ను బాబు అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆయ‌న శాఖ‌ల్లో సైతం బాబు కోత‌లు పెట్టేస్తున్నారు. కీల‌క‌మైన రెవెన్యూ శాఖ‌కు ప్రాధినిత్యం వ‌హిస్తోన్న కేఈని ప‌క్క‌న పెట్టి ఆ శాఖ‌లో చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు కూడా వేలు పెట్టేస్తున్నారు. కేఈకి కీల‌క‌మైన రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంతో పాటు రెవెన్యూ శాఖ‌లో బదిలీల సమయంలో ఆయ‌న‌కు ఎన్నో అవ‌మానాలు జ‌రిగాయి.

తాజాగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రుల ఎంపిక‌లో మ‌రో డిప్యూటీ సీఎం నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌కు విశాఖ జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గించి కేఈని మ‌త్రం ఏ జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా నియ‌మించ‌లేదు. ఇక ప్ర‌కాశం జిల్లాకు చెందిన మంత్రి సిద్ధా రాఘ‌వ‌రావుతో పాటు మ‌హిళా మంత్రి ప‌రిటాల సునీత‌కు సైతం జిల్లాల బాధ్య‌త‌లు అప్ప‌గించ‌లేదు. ఇక బీజేపీ మంత్రులు పైడికొండ‌ల మాణిక్యాల‌రావుతో పాటు కామినేని శ్రీనివాస‌రావుకు కూడా చంద్ర‌బాబు జిల్లాల ఇన్‌చార్జ్‌ల బాధ్య‌త‌లు అప్ప‌గించ‌లేదు. వీరిద్ద‌రిని పార్టీ ప‌రంగా ప‌క్క‌న పెట్టార‌నుకున్నా సిద్ధా, సునీత‌ల‌ను ఎందుకు ప‌క్క‌న పెట్టారో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.

ఇక సునీత‌కు వ్య‌క్తిగ‌తంగాను, ప‌రిటాల ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ ప‌రంగాను కాస్తో కూస్తో ప్ర‌యారిటీ ఇస్తున్నా మంత్రి సిద్ధా విష‌యంలో మాత్రం ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. సిద్ధాను ప్ర‌క్షాళ‌న‌లో త‌ప్పించ‌క‌పోయినా ఆయ‌న త‌న ప‌నితీరు మార్చుకోవడం లేద‌ని బాబు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని ఏపీ స‌చివాల‌యంలో వినిపిస్తోన్న టాక్‌. సిద్ధా వ‌ల్ల ప్ర‌కాశం జిల్లాలో పార్టీకి ఒరిగిందేమి లేద‌న్న నివేదిక కూడా చంద్ర‌బాబు వ‌ద్ద ఉంది. ఏదేమైనా త‌న పార్టీకే చెందిన కేఈ, సిద్ధా విష‌యంలో బాబు అస్స‌లు ఇంట్ర‌స్ట్‌తో లేర‌న్న‌దే వెల‌గ‌పూడి ఇన్న‌ర్ టాక్‌.