అమరావతిలో రోడెక్కిన టీడీపీ నాయకుల ఫైటింగ్

ఏపీ టీడీపీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో ఏర్ప‌డ్డ అసంతృప్తి జ్వాల‌లు ఇంకా చ‌ల్లార‌లేదు. మంత్రి ప‌ద‌వులు రాని సీనియ‌ర్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు ఇప్ప‌టికే వివిధ రూపాల్లో త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వి రాని ఓ ఎమ్మెల్యే అనుచ‌రులు మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన మంత్రిని అడ్డుకుని నానా హంగామా చేశారు. ఇదంతా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో జ‌ర‌గ‌డం విశేషం.

మంత్రివ‌ర్గ ప్రక్షాళ‌న‌లో గుంటూరు జిల్లా నుంచి రావెల కిషోర్‌బాబును త‌ప్పించిన చంద్ర‌బాబు వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన వేమూరు ఎమ్మెల్యే న‌క్కా ఆనంద్‌బాబుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. మంత్రి ప‌ద‌వి ఆశించిన తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్ర‌వ‌ణ్‌కుమార్‌కు నిరాశ త‌ప్ప‌లేదు. తాజా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న ఆనంద్‌బాబు వెలగపూడి సచివాలయం సమీపంలోని ఐనవోలు గ్రామం వద్ద అంబేద్క‌ర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని స్థల పరిశీలన కోసం మంత్రి నక్కా ఆనంద్‌బాబు గురువారం ఐనవోలుకు చేరుకున్నారు.

స్థానిక ఎమ్మెల్యే శ్ర‌వ‌ణ్‌కుమార్ అనుచ‌రులు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. రాజ‌ధాని నిర్మాణానికి రైతుల‌ను ఒప్పించి భూముల స‌మీక‌ర‌ణ‌కు ఎంతో సాయం చేసిన శ్ర‌వ‌ణ్‌కుమార్‌కు జ‌రిగే బ‌హుమానం ఇదేనా ? అంటూ వారు మంత్రి ఆనంద్‌బాబుపై ఫైర్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించేట‌ప్పుడు త‌మ ఎమ్మెల్యేకు ఎందుకు చెప్ప‌లేదంటూ వారు మంత్రిని ప్ర‌శ్నించ‌డంతో పాటు ఆయ‌న కాన్వాయ్ ముందుకు క‌ద‌ల‌కుండా రోడ్డుపై బైఠాయించారు.

చాలా సేప‌టి వ‌ర‌కు మంత్రి కాన్వాయ్ ముందు నుంచి వారు త‌ప్పుకోక‌పోవ‌డంతో మంత్రి ఆనంద్‌బాబు సైతం తీవ్ర అస‌హ‌నానికి గుర‌య్యారు. చివ‌ర‌కు మంత్రి, అధికారులు వెనుతిరిగారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ తోపాటు ఆయన అనుచరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తే ప‌రిస్థితి తీవ్రంగా ఉంటుంద‌ని బాబు శ్ర‌వ‌ణ్‌కుమార్‌కు వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.