టీడీపీ+జ‌న‌సేన పొత్తు…. జ‌న‌సేన సీట్ల లెక్క తేల్చేసిన బాబు

ఎవ‌రెన్ని అనుకున్నా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జ‌న‌సేన మంచి మంచి అవ‌గాహ‌న ఉంది. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మంచి దోస్తులే అన్న‌ది క‌నీస రాజ‌కీయ అవ‌గాహ‌న ఉన్న‌వారికి ఎవ‌రికి అయినా అర్థ‌మ‌వుతుంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన పార్టీ పెట్టిన ప‌వ‌న్‌కళ్యాణ్ ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా చంద్ర‌బాబు లాంటి స‌మ‌ర్థ నాయ‌క‌త్వానికి మ‌ద్ద‌తు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని టీడీపీకి స‌పోర్ట్ చేశాడు.

ఇక 2019 ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. తాను అనంత‌పురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ జ‌న‌సేన అన్ని స్థానాల్లోను పోటీ చేయ‌ద‌ని కూడా చెప్పారు. జ‌న‌సేన బ‌లంగా ఉన్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనే పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను నిల‌బెడ‌తామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. మ‌రి జ‌న‌సేన పోటీ చేసే స్థానాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థ‌ల‌కు జ‌న‌సేన అభిమానులు స‌పోర్ట్ చేస్తారు ? మ‌రి మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన అభిమానులు ఎవ‌రికి ఓట్లు వేయాలి ? అన్న ప్ర‌శ్న‌లు స‌హ‌జంగానే ఉత్ప‌న్న‌మయ్యాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు పైకి చెప్ప‌క‌పోయినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన టీడీపీతోనే జ‌ట్టుక‌ట్టి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌బోతుంద‌ని తెలుస్తోంది. పొత్తుల విష‌యంలో ఇంకా క్లారిటీ లేక‌పోయినా వీరిద్ద‌రు క‌లిసే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతార‌ని అందుకే ప‌వ‌న్ ముందుగా వ్యూహాత్మ‌కంగానే త‌మ పార్టీ అన్ని స్థానాల్లోను పోటీ చేయ‌ద‌ని చెప్పార‌న్న చ‌ర్చ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో ఇంట‌ర్న‌ల్‌గా పొత్తు ఖ‌రారు కావ‌డంతో చంద్ర‌బాబు ఆ పార్టీకి మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 25 సీట్లు ఇవ్వాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

ఈ మేర‌కు చంద్ర‌బాబు ఇప్ప‌టికే త‌న‌కు అత్యంత స‌న్నిహితులు అయిన ఒక‌రిద్ద‌రు మంత్రుల‌తో కూడా ఇదే విష‌య‌మై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. జ‌న‌సేన‌కు 25 సీట్లు ఇంకా పెంచాల్సి వ‌స్తే మరో 5 సీట్లు పెంచి 30 సీట్ల‌కు లోపుగానే ఇచ్చే అంశంపై బాబు చ‌ర్చల్లో మునిగి తేలుతున్నార‌ట‌. ఇక తెలంగాణ‌లో కూడా కొన్ని సీట్లలో పోటీ చేయాల‌నుకుంటోన్న ప‌వ‌న్ గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో టీడీపీతో పొత్తులో భాగంగా 4-5 సీట్ల‌లో పోటీ చేయ‌వ‌చ్చ‌ని కూడా తెలుస్తోంది. మ‌రి ఏపీ, తెలంగాణ‌లో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మాత్రం అన్ని చోట్లా పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మ‌రి జ‌న‌సేన 25 -30 సీట్ల‌కే ప‌రిమిత‌మైతే వాళ్లు కాస్తా అసంతృప్తి చెందే ఛాన్సులు ఉన్నాయి.