రాజీనామా చేయాలని జ‌య‌దేవ్‌కు బాబు వార్నింగ్

గుంటూరు ఎంపీ, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు బావ గ‌ల్లా జ‌య‌దేవ్‌పై ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. జ‌య‌దేవ్‌కు చంద్ర‌బాబు వార్నింగ్ ఇవ్వ‌డం వెన‌క ఏపీ ఒలంపిక్ అసోసియేష‌న్ వివాద‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఏపీ ఒలంపిక్ సంఘం అసోసియేష‌న్ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం గ‌ల్లా జ‌య‌దేవ్, క‌డ‌ప జిల్లాకు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం.ర‌మేశ్ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో ఫైటింగ్ జ‌రిగింది.

గ‌త రెండేళ్లుగా వీరు ఏపీ ఒలంపిక్ సంఘం త‌మ‌దంటే త‌మ‌దే అని వాదులాడుకున్నారు. ఈ గొడ‌వ‌లు ఎట్ట‌కేల‌కు ఇటీవ‌లే స‌ద్దుమ‌ణిగినా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ బిడ్లను ద‌క్కించుకోవ‌డంలో ఏపీ విఫ‌ల‌మైంది. దీంతో చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో తక్షణం ఒలంపిక్‌ సంఘం కార్యవర్గం పదవులకు రాజీనామా చేయాలని జ‌య‌దేవ్‌కు వార్నింగ్ ఇచ్చార‌ని స‌మాచారం.

న‌వ్యాంధ్ర ఆవిర్భావం త‌ర్వాత జాతీయ స్థాయిలో ఓ పెద్ద క్రీడాకార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి ఆ త‌ర్వాత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆసియా క్రీడ‌లు నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు స్కెచ్ గీశారు. అయితే ఇప్పుడు ఆయ‌న వేసిన ప్లాన్ మొత్తం రివ‌ర్స్ అయ్యింది. దీంతో ఆయ‌న ఆ కోపం..ఈ కోపం మొత్తం జ‌య‌దేవ్‌పై చూపించేశారు.

క్రీడా సంఘాల్లో రాజ‌కీయ జోక్యం వ‌ద్ద‌ని చంద్ర‌బాబు ఇటు జ‌య‌దేవ్‌కు, అటు సీఎం ర‌మేశ్‌కు చెపుతూనే ఉన్నారు. మూడు నెల‌ల క్రిత‌మే బాబు ఈ విష‌యంలో ర‌మేశ్‌కు వార్నింగ్ ఇవ్వ‌డంతో ఆయ‌న వెన‌క్కు త‌గ్గారు. ఏపీ ఒలంపిక్‌ సంఘం వివాదం కోర్టులో ఉండటంతో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ నేరుగా జాతీయ క్రీడలకు బిడ్లను దాఖలు చేసింది.

అయితే ఇప్పుడు జాతీయ క్రీడల నిర్వహణ కాస్త చత్తీస్‌ఘడ్‌కు దక్కింది. ఈ పరిణామాలన్నింటిని గమనించిన చంద్రబాబు శాప్‌ ప్రక్షాళన ప్రారంభించారు. ఒలంపిక్‌ సంఘం వివాదం నుంచి ఎంపీలిద్దరు తక్షణం తప్పుకోవాలని ఆదేశించడం చర్చనీయాంశమైంది.