ప్రభుత్వం ఆలోచించింది ఒకటైతే.. జరిగిన ప్రచారం మరొకటి

ఒకే ఒక్క వార్త మూడేళ్ల కష్టాన్ని వృథా చేసింది. ఇన్నాళ్లూ జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్న ఉద్యోగుల‌ను దూరం చేసేసింది. సీఎం చంద్ర‌బాబు క‌ష్టాన్నంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరు చేసింది. అది వాస్త‌వ‌మో అవాస్త‌వ‌మో తెలీదు గాని.. ఉద్యోగుల్లో మాత్రం ప్ర‌భుత్వంపై అభ‌ద్ర‌తా భావాన్ని క‌లిగించేలా చేసింది. `నేను గ‌తంలోలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌ను. నేను మారాను. న‌న్ను న‌మ్మండి` అంటూ 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉద్యోగుల‌కు హామీ ఇచ్చిన చంద్ర‌బాబు.. అలా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. ఒకే ఒక్క క‌థ‌నంతో మొత్తం సీన్ రివ‌ర్స్ అయిపోయింది. అయితే ఇదంతా సీఎంవోలోని కొంద‌రు లీకులివ్వ‌డం వ‌ల్లే జ‌రిగిందని అధికార‌వ‌ర్గాలు భావిస్తున్నారు.

ఉద్యోగుల‌కు వారానికి రెండు రోజులు సెల‌వులు, వారి కోసం ప్ర‌త్యేకంగా రైలు, బ‌స్సు సౌక‌ర్యాలు.. ఆర్థిక ప‌రిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా.. పొరుగు రాష్ట్ర ఉద్యోగుల‌తో స‌మానంగా సౌక‌ర్యాలు.. అడిగిందే త‌డువుగా.. ఏద‌డిగినా ఇచ్చేందుకు ఏమాత్రం వెనుకాడ‌లేదు సీఎం చంద్ర‌బాబు!! 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో `ఉద్యోగులు` కీల‌కంగా మార‌డంతో చంద్ర‌బాబు వారిపై వ‌రాల జ‌ల్లులు కురిపించారు. గ‌తం మ‌రిచిపోవాల‌ని, కొత్త చంద్ర‌బాబును చూస్తార‌ని వారిలో న‌మ్మ‌కం క‌లిగించారు. అప్ప‌టి నుంచి ఉద్యోగుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గతంలో వలే వారిపై తన అధికార జులుంను చెలాయించకుండా మిత్రత్వం నెరపుతున్నారు.

మూడు రోజుల క్రితం ఉద్యోగుల వయస్సు పరిమితిని 50 ఏళ్ల‌కు త‌గ్గిస్తున్నార‌నే వార్తతో అప్పటివరకూ ముఖ్యమంత్రి పట్ల సానుకూలంగా వ్యవహరించిన ఉద్యోగులు ఒక్కసారిగా ఆయ‌న‌కు వ్యతిరేకంగా మారిపోయారు. తాము అసలు అటువంటి ప్రతిపాదనలు సిద్దం చేయలేద‌ని మంత్రులు మొత్తుకుంటున్నా నమ్మడం లేదు. గతంలో తమ పట్ల వ్యవహరించిన రీతిలోనే సీఎం మళ్లీ వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ఖజానా తీవ్రమైన లోటులో ఉండి కూడా ఉద్యోగులకు తెలంగాణ ఉద్యోగులతో సమానంగా 42శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి ఆయన వారిని సంతృప్తి పరిచారు. ఇన్ని సౌకర్యాలు అన్నీ కల్పించినా వారు సీఎం పట్ల అనుమాన పూర్వకంగానే చూస్తున్నారు.

కేంద్ర సర్వీసు రూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తామని ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదు. కేవలం అవినీతి, అక్రమాలకు పాల్పడి వందలకోట్ల రూపాయలను సంపాదించిన ఉద్యోగులపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న విషయంపైనే చర్చ జరిగింది. ఏసీబీ దాడుల్లో దొరికితే జైలు జీవితం, తరువాత కోర్టు కేసులతో రావాల్సిన ప్రయోజనాలు రాకుండా పోతాయి. అదే బలవంతంగా పదవీ విరమణ చేయిస్తే వారికి రావాల్సిన ప్రయోజనాలు మొత్తం వస్తాయి. ఇది అటు ప్రభుత్వానికి…ఇటు ఉద్యోగికి ఉభయతారకంగా ఉంటుంది. ప్రభుత్వం ఆలోచించింది ఒకటైతే.. జరిగిన ప్రచారం మరొకటి. ఏదేమైనా జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.