బీజేపీని వ‌దిలించుకునే య‌త్నాల్లో బాబు

నంద్యాల ప్ర‌చారం చివ‌రి ద‌శ‌కు చేరుకున్నా.. ఇప్ప‌టికీ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ ప్ర‌చారంలో క‌నిపించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో.. వీటికి తెరదించాల‌ని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. ఇప్ప‌టికే ఎడ‌మొహం.. పెడ‌మొహంగా ఉంటున్న నేత‌ల్లో మ‌రోసారి విభేదాలు వ‌చ్చేలా చేస్తోంది. వైసీపీతో జ‌త క‌ట్టేందుకు బీజేపీ నేత‌లు సుముక‌త వ్య‌క్తంచేస్తున్న త‌రుణంలో.. టీడీపీ అధినేత ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక‌.. ఏదో మ‌త‌ల‌బు ఉంద‌ని బీజేపీ నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. మొత్తానికి బీజేపీని వ‌దిలించుకునే భాగంలో.. ఇది చంద్ర‌బాబు ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల‌ ప్ర‌చారం హీటెక్కింది. టీడీపీ, వైసీపీ ప్రచారం తార‌స్థాయికి చేరింది. అయితే ఇప్ప‌టివ‌రకూ మిత్ర‌ప‌క్షమైన బీజేపీని ప్ర‌చారానికి పిలవ‌క‌పోడంపై టీడీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. బీజేపీ నేత‌ల‌ను నంద్యాల ప్ర‌చారానికి ఆహ్వానించారు. కానీ మెడ‌లో బీజేపీ కండువాలు వేసుకోకుండా, చేతిలో బీజేపీ జెండాలు ప‌ట్టుకోకుండా రావాల‌ని మెలిక పెట్ట‌డంతో బీజేపీ నేత‌లు అవాక్క‌య్యార‌ట‌. త‌మ‌ను పిల‌వ‌క‌పోయినా ఫ‌ర్వాలేదుగానీ.. ఇలా పిలిచి అవ‌మానించ‌డం ఎందుక‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు

బీజేపీ నేత‌లు!!

విజయవాడ సిటీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పార్టీ పదాధికారుల (రాష్ట్ర కమిటీ) సమావేశంలో ఈ అంశంపై ఘాటుగా చర్చ జరిగింది. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి గెలుపునకు సహకరించాలని చంద్రబాబే తనకు ఫోను చేసి కోరినట్టు కంభంపాటి హరిబాబు తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన కపిలేశ్వరయ్య (పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు), మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నంద్యాలలో బీజేపీ నేతలను పార్టీ కండువాలు వేసుకొని రావద్దని, జెండాలను పట్టుకుని రావద్దని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు అంటున్న విషయాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకొచ్చారు.

అందువల్లే తాము ప్రచారానికి దూరంగా ఉంటున్నామని తెలిపారు. జెండాలు లేకుండా రమ్మనడం టీడీపీ తప్పేనని హరిబాబు వ్యాఖ్యానించారు. అయినా చంద్రబాబు కోరిక మేరకు టీడీపీ గెలుపునకు సహకరించాల్సిందేనన్నారు. మ‌రి మొత్తానికి చంద్ర‌బాబు వ్యూహాలు మాత్రం.. బీజేపీ నేత‌ల‌కు చుక్క‌లు చూపెడుతున్నాయి. మొత్తానికి పొమ్మ‌న‌లేక పొగ‌బెట్టిన విధంగా.. ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.