ఆ జిల్లాలో ముగ్గురు ఎంపీల‌కు బాబు టిక్కెట్ ఇవ్వ‌డ‌ట‌..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు పెద్ద షాకింగ్ డెసిష‌న్ తీసుకోబోతున్నారా ? ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒకే జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇవ్వ‌రా ? అంటే ప్ర‌స్తుతం ఆ జిల్లాలో వినిపిస్తోన్న రాజ‌కీయ చ‌ర్చ‌ల ప్ర‌కారం అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. ఏపీలోని పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావ‌రి జిల్లాలో మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఈ మూడు స్థానాలు టీడీపీ ఖాతాలోనే ప‌డ్డాయి.

రాజ‌మండ్రి నుంచి సినీన‌టుడు మాగంటి ముర‌ళీమోహ‌న్‌, కాకినాడ నుంచి మాజీ మంత్రి తోట న‌ర‌సింహం, అమ‌లాపురం నుంచి పండు ర‌వీంద్ర‌బాబు గెలిచారు. ఈ ముగ్గురికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి టిక్కెట్ ఇచ్చేందుకు బాబు సుముఖంగా లేర‌ని తెలుస్తోంది. రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్‌కు వ‌యోభారం దృష్ట్యా ప‌క్క‌న పెట్టేయాల‌ని బాబు భావిస్తున్నారు.

ముర‌ళీమోహ‌న్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి నుంచి టీడీపీ త‌ర‌పున ముర‌ళీమోహ‌న్ కోడ‌లు రూపాదేవి లేదా మ‌రో పారిశ్రామిక‌వేత్త పేరు లైన్లో ఉన్నాయి.

ఇక కాకినాడ ఎంపీ తోట న‌ర‌సింహంను మ‌రోసారి కంటిన్యూ చేయ‌ర‌ని అంటున్నారు. ఇటీవ‌ల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రు లేదా ఆయ‌న కుమారుడు న‌వీన్‌ల‌లో ఒక‌రు కాకినాడ ఎంపీగా మ‌రొక‌రు జ‌గ్గంపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌న్న చ‌ర్చ‌లు జిల్లాలో వినిపిస్తున్నాయి.

ఇక వ‌రుస వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారిన అమ‌లాపురం పండు ర‌వీంద్ర‌బాబుకు బ‌దులుగా అదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన మ‌రో వ్య‌క్తి పేరు బాబు ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌. ఏదేమైనా ఒకే జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీల‌కు టిక్కెట్ ఇవ్వ‌క‌పోవ‌డం అంటే అది పెద్ద సాహ‌సంగానే చెప్పుకోవాలి.