బాబు దెబ్బ‌తో బెదిరిపోయిన తెలుగు త‌మ్ముళ్లు

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న విశ్వ‌రూపం చూపించారు. వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంపై త‌న స్ట్రాట‌జీ వివ‌రించారు. కాల‌రెగ‌రేస్తున్న త‌మ్ముళ్ల‌పై నిప్పులు చెరిగారు. తోక‌లు క‌ట్ చేస్తాన‌ని హెచ్చ‌రించారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జులు, నేత‌ల స‌మావేశంలో బాబు చెల‌రేగిపోయారు. దీంతో త‌మ్ముళ్లు గుండెలు బాదుకున్నారు. విష‌యంలోకి వెళ్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనే కాకుండా రాబోయే 30 ఏళ్ల‌పాటు అధికారంలోనే ఉండాల‌ని బాబు డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌జ‌ల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. అదేస‌మ‌యంలో గెలుపు గుర్రాల‌కే టికెట్లు ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. 

ఇదే విష‌యాన్ని ఆయ‌న టీడీపీ నేత‌ల‌కు కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మరీ చెప్పారు.  ఎన్నికల్లో ప్రజాభిమానం ఉన్నవారికే, గెలిచే సత్తా ఉంటే మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు.  వివిధ సర్వేల ద్వారా అభ్యర్థుల గుణగణాలను పరిశీలించి ఎంపిక చేస్తానని బాబు గుండెల్లో గుబులు పుట్టించారు.   నేతల పరిస్థితి బాగా లేకుంటే ఎంతటి సీనియర్‌ అయినా పక్కన పెడతాన‌ని హెచ్చ‌రించారు. వివిధ జిల్లాల్లో అనేక మంది ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వచ్చాయ‌ని,  కుటుంబ సభ్యుల పెత్తనం మితిమీరిపోయింద‌ని ఇవ‌న్నీ త‌న‌కు తెలుసున‌ని బాబు హెచ్చ‌రించ‌డంతో నేత‌లు ఒక్క‌సారిగా డంగైపోయారు! 

ఇప్పటికే  త‌న‌కు అందిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యేలపై ప్రజల్లో కొంత‌ వ్యతిరేకత ఉంద‌ని బాబు చెప్పుకొచ్చారు.  పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉన్నా కొంత మంది ప్రజాప్రతినిధులపై తీవ్రమైన వ్యతిరేకత ఉంద‌ని, మంత్రులు నువ్వా.. నేనా అన్నట్లు ఆధిపత్య పోరు సాగిస్తున్నారని,  కష్టపడి సంపాదించుకున్న ప్రజాధరణను చెడగొడుతున్నారని కూడా బాబు ఫైరైపోయారు. పార్టీపట్ల ప్రజలకు  అభిమానం పెరుగుతున్నా.. కొంత మంది ప్రజాప్రతినిధులు పనితీరుపై ఓటర్లలో అసంతృప్తి వ్యక్తం అవుతుంద‌ని బాబు చెప్పుకొచ్చారు. కొంత మంది ప్రజాప్రతినిధులు భూ ఆక్రమణల్లో పాలుపంచుకుంటున్నారని, ఇప్పటికైనా అవి మానాలని, కాంట్రాక్టర్ల దగ్గర ఎమ్మెల్యేలు కూడా పర్సెంటేజీలు తీసుకుంటున్నారని ఇది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని హెచ్చ‌రించారు. 

కొందరు ఎమ్మెల్యేలు బినామీలను అడ్డుపెట్టుకుని విలువైన ప్రభుత్వ ఆస్తులను కొట్టేస్తున్న‌ట్టుగా కూడా బాబు హెచ్చ‌రించిన‌ట్టు స‌మాచారం. నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమమైనా, ఎటువంటి సిఫార్సులైనా ముందుగా ఎమ్మెల్యేల సిఫార్సు లేనిదే జరగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి పారిశ్రామిక వేత్తల నుంచి పెద్దస్థాయి పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని, ఇందులో ఎవరెవరి హస్తం ఉందో అనే దానిపై ఇప్పటికే తాను నివేదిక తెప్పించుకున్నానని, కొన్ని నియోజకవర్గ గ్రామాల్లో పార్టీ నాయకులు పట్టపగలే కొట్టుకుంటున్నార‌ని ఇది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని బాబు హెచ్చ‌రించారు. 

ఇలాంటి డొంక‌తిరుగుడు విధానాల‌ను  సవరించుకోకపోతే మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వనని బాబు తేల్చి చెప్పారు. దీంతో ఇప్పటికైనా పద్దతి మార్చుకోకపోతే చాలా మంది నాయకులు తెరమరుగు అయ్యే ప్రమాదం ఉందని మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా వర్గాలతో ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు కఠిన వైఖరి అవలంభిస్తున్న నేపథ్యంలో తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మ‌రి రాబోయే రోజుల్లో బాబు ఇంకెంత క‌ఠినంగా ఉంటారో చూడాలి.