కొత్త నియోజ‌క‌వ‌ర్గంపై చింత‌మ‌నేని క‌న్ను..!

చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌రావు ఈ పేరు విన‌గానే మ‌న‌కు ఏపీ ప్ర‌భుత్వ విప్ క‌న్నా కాంట్ర‌వ‌ర్సీ కింగ్ అన్న ట్యాగ్‌లైన్ ఠ‌క్కున గుర్తుకు వ‌స్తుంది. నిత్యం వివాదాల‌తో సావాసం చేసే చింతమ‌నేని ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన చింత‌మ‌నేని దూకుడు ముందు నియోజ‌క‌వ‌ర్గంలో విప‌క్షాలు ఆగ‌లేక‌పోతున్నాయి.

ఇదిలా ఉంటే రాజ‌కీయంగా త‌న నియోజ‌క‌వ‌ర్గ విష‌యంలో చింత‌మ‌నేని కొత్త స్టెప్ తీసుకోనున్నారా ? అంటే అవున‌నే ఆన్స‌రే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో వినిపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ప్ర‌భాక‌ర్ కొత్త‌గా ఏర్ప‌డే ఏలూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న స‌న్నిహితుల వ‌ద్ద కూడా చెప్పిన‌ట్టు దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం ఊపందుకుంది.

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే జిల్లా కేంద్రంగా ఉండి, ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న ఏలూరుతో పాటు కొత్త‌గా ఏలూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డుతుంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఉన్న దెందులూరుకు బ‌దులుగా ఈ కొత్త నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డ‌నుంది. ప్ర‌స్తుతం దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో స‌గం మాత్ర‌మే ఉన్న ఏలూరు రూర‌ల్ మండ‌లం పూర్తిగాను పెద‌వేగి, పెద‌పాడు మండ‌లాల‌తో ఏలూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంగా ఉన్న దెందులూరు మండ‌లం ప‌క్క‌నే ఉన్న ఉంగుటూరులో విలీనం అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాక‌ర్ ఏలూరు రూర‌ల్ నుంచి పోటీ చేసేందుకు రెడీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.