ఆయ‌నపై ఎన్నోఆశ‌లు… కానీ`హ్యాండ్` ఇస్తున్నాడా!

ఎంపీ చిరంజీవి.. ఈ పేరు పొలిటిక‌ల్ స్క్రీన్‌పై వినిపించి చాలా రోజులైంది. మెగాస్టార్ చిరంజీవి అనే పేరు కొంత కాలం  నుంచి ఎక్కువ‌గా వినిపిస్తోంది. రెండింటికీ తేడా ఏమీ లేక‌పోయినా.. పిలుపులోనే చాలా వ్య‌త్యాసం ఉంది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం.. ఏపీలో కాంగ్రెస్‌కు అండ‌గా చిరు ఉంటాడ‌ని ఆయ‌నపై ఎన్నోఆశ‌లు పెట్టుకుంది అధిష్ఠానం. కానీ వాటిని వ‌మ్ము చేసి.. తన‌మానాన సినిమాలు చేసుకుంటూ బిజీబిజీ అయిపోతున్నాడు మెగాస్టార్‌!! రాజ‌కీయాల‌కు సంబంధించిన ఏ కార్య‌క్రమంలోనూ క‌నీసం మ‌చ్చుకైనా క‌నిపించిన దాఖ‌లాలు లేవు. క‌ష్ట‌కాలంలో అండ‌గా నిలిచిన పార్టీ ఇబ్బందుల్లో ఉంటే.. ముఖం చాటేస్తున్నాడ‌ని పార్టీ నేత‌లు వాపోతున్నార‌ట‌. 

పొలిటికల్ పార్టీ పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తాడనుకున్న చిరంజీవి.. అట్టర్ ప్లాప్ అయ్యారు. బాక్సాఫీస్ ముందే బొమ్మ బోల్తా పడింది. తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా విలీనం చేశారు. అందుకు ఆయనకు బహుమతిగా రాజ్యసభ పదవి ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే రాష్ట్ర విభజన ముందు వరకూ రాజకీయాల్లో ఫుల్ టైమ్ వర్క్ చేసిన చిరు విభజనానంతరం రాజకీయాలకు దూరమయ్యారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ అంప‌శ‌య్య మీద ప‌డిపోయింది. ఏపీలో ఆ పార్టీని ప్ర‌జ‌లు క్ష‌మించ‌లేదు. అప్ప‌టినుంచి ఇప్ప‌టివ‌ర‌కూ కాంగ్రెస్ పేరు ఏపీలో ఏమాత్రం వినిపించ‌డంలేదు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పూర్తిగా కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు చిరంజీవి ప్రయత్నిస్తారని అందరూ భావించారు. కాని చిరు మాత్రం తనకు రాజకీయాలు పడవని చెబుతున్నట్లు తెలిసింది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ.. ఏపీలో మేమూ ఉన్నామ‌ని గుర్తుచేసేందుకు కాంగ్రెస్ నేత‌లు ఆపసోపాలు ప‌డుతున్నారు. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత చిరు త‌న 150వ సినిమా చేయ‌డం.. దానిని విడుద‌ల‌చేయ‌డం అన్నీ జ‌రిగిపోయాయి. అలాగే `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` అంటూ బుల్లితెర‌పైనా అల‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక ఇప్పుడు స్వాతంత్య్ర‌దినోత్స‌వం సంద‌ర్భంగా 151 సినిమాను ప్రారంభించ‌బోతున్నాడు. 

నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. దీని ప్రచారానికి వచ్చేందుకు చిరంజీవి సుముఖత వ్యక్తం చేయలేద‌ట‌. ఇప్ప‌టికే టీడీపీ, వైసీపీ హోరాహోరాగా త‌ల‌ప‌డుతున్న త‌రుణంలో.. ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థిని నిల‌బెట్టింది. చిరు ప్ర‌చారానికి వస్తే కాపు సామాజిక‌వ‌ర్గ ఓట్లు కొన్నైనా ప‌డ‌తాయని ఆశ‌ప‌డ్డారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. ఇటీవల రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న చిరంజీవి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అనేకసార్లు ఫోన్ చేసి చెప్పినా ఆయన తనకు వ్యక్తిగత పనులున్నాయంటూ సున్నితంగానే తిరస్కరిస్తున్నార‌ట‌.