మెగాస్టార్ ‘ ఉయ్యాల‌వాడ‌ ‘ టైటిల్ చేంజ్‌…. కొత్త టైటిల్‌

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో చిరు వెండితెర రీ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చిరు వ‌రుస‌పెట్టి సినిమాలు ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే చిరు త‌న 151వ సినిమాగా క‌ర్నూలు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతుండ‌గా ఈ సినిమాకు స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా కోసం సురేంద‌ర్‌రెడ్డి ఇప్ప‌టికే మూడు నెల‌లుగా స్క్రిఫ్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. ఇక రూ.100 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

ఈ సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి టైటిలే ఫిక్స్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి టైటిల్ మార్చి ‘ మ‌హావీర ‘ టైటిల్ పెట్టాల‌ని చిత్ర‌యూనిట్ భావిస్తోంద‌ట‌. ‘ మ‌హావీర ‘ టైటిల్ అయితే క‌రెక్ట్‌గా యాప్ట్ అవుతుంద‌ని చిత్ర‌యూనిట్ భావిస్తోంద‌ట‌.

ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో తెర‌కెక్క‌నుంది. ఆగ‌స్టు 15న ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్స‌వం జ‌రుపుకోనుంది. ఇక ఈ సినిమాకు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్‌.రెహ్మ‌న్ సంగీతం అందిస్తార‌ని తెలుస్తోంది. ఇక హీరోయిన్‌గా ప్ర‌ముఖ బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా ప‌డుకునే న‌టిస్తుంద‌ని స‌మాచారం.