వైసీపీ నుంచి రాజ్య‌స‌భ‌కు చిరంజీవి..!

ప్ర‌ముఖ సినీన‌టుడు, మాజీ కేంద్ర‌మంత్రి, రాజ్య‌స‌భ స‌భ్యుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్టే క‌న‌ప‌డుతోంది. త‌న ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరు ఆ త‌ర్వాత ఆ పార్టీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపికై కేంద్ర‌మంత్రిగా కూడా ప‌నిచేశారు. కొద్ది రోజులుగా చిరు కాంగ్రెస్ కార్య‌క‌లాపాల‌కు పూర్తిగా దూర‌మైపోయారు. ఇటీవ‌ల కాంగ్రెస్ ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం గుంటూరులో నిర్వ‌హించిన స‌భ‌కు రాహుల్‌గాంధీతో పాటు జాతీయ‌స్థాయి నాయ‌కులు సైతం హాజ‌ర‌య్యారు.

జాతీయ‌స్థాయిలో వివిధ పార్టీల నాయకులు హాజ‌రైనా చిరు మాత్రం రాలేదు. కాంగ్రెస్ ఈ స‌భ‌ను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించింది. రాహుల్‌గాంధీతో పాటు శరద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ, సీపీఐ నేతలు వ‌చ్చారు. చిరు ఎందుకు రాలేద‌ని మీడియా ఆరా తీస్తే చిరు ఫ్యామిలీతో విదేశీ టూర్‌కు వెళ్లాడ‌ని కాంగ్రెస్ వాళ్లు క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

కానీ అత్యంత విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్రకారం చిరు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి వైసీపీలోకి వెళ్లే అంశంపై ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. చిరు విదేశీ టూర్‌లో న్యూజిలాండ్‌లో విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో భేటీ అయిన‌ట్టు తెలుస్తోంది. చిరు వైసీపీలో చేరితే ఎలాంటి ప్రాధాన్య‌త ల‌భిస్తుంద‌నే అంశంపై సైతం వీర‌ద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

చిరు వైసీపీలో చేరితే ఆయ‌న రాజ్య‌స‌భ సీటును మ‌రోసారి రెన్యువ‌ల్ చేసే అంశంపై జ‌గ‌న్ నుంచి హామీ వ‌చ్చింద‌న్న టాక్ ఏపీ పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో కొంద‌రు సీక్రెట్‌గా చ‌ర్చించుకుంటున్నారు. ఇక వీరిద్ద‌రు న్యూజిలాండ్‌లో భేటీ అయిన అంశం లీక్ కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నా…వైసీపీ వ‌ర్గాల ద్వారానే ఈ మ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

చిరును పార్టీలో చేర్చుకుంటే త‌మ‌కు వ‌చ్చే లాభ‌న‌ష్టాల‌ను జ‌గ‌న్ త‌న‌కు అత్యంత స‌న్నిహితుల వ‌ద్ద భేరీజు కూడా వేసుకుంటున్న‌ట్టు టాక్. చిరు పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌పై కొద్ది రోజుల్లోనే క్లారిటీ రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.