ఉద్యోగుల‌కు చిరు `కోటీశ్వ‌రుడి` దెబ్బ‌

150వ సినిమాతో ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసి త‌న స‌త్తా ఏంటో నిరూపించాడు మెగాస్టార్ చిరంజీవి! సంక్రాంతికి విడుద‌లైన `ఖైదీ నెం 150` సినిమా దాదాపు వంద కోట్లు వ‌సూలు చేసింది. సిల్వ‌ర్ స్క్రీన్‌పై అద‌ర‌గొట్టిన చిరు.. బుల్లితెర‌పై మాత్రం నిరాశ‌ప‌రిచాడు. మాటీవీ యాజ‌మాన్యం స్టార్ చేతిలోకి వెళ్లిన త‌ర్వాత ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా.. చిరు హోస్ట్‌గా `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు`ను ప్రారంభించింది. గ‌త సిరీస్‌ల క‌న్నా ఇది పెద్ద హిట్ అవుతుంద‌ని భావించింది. కానీ అంచానాలు తారుమార‌య్యాయి. అయితే `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` ఉద్యోగుల‌కు చిరు స్ట్రోక్ గట్టిగా త‌గిలింది. సుమారు 80 మంది ఇప్పుడు నిరుద్యోగులుగా మారిపోయారు. మ‌రికొంత‌మందిపై వేటు సిద్ధంగా ఉంది.

ఒకప్పుడు మా టీవీ యజమానుల్లో ఒకరిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి అంటే.. ఉద్యోగుల‌కు ప్రత్యేకమైన‌ అభిమానం. మా టీవీ ని స్టార్ యాజమాన్యం కొనుగోలు చేసినా ఉద్యోగుల‌కు, చిరుకు మ‌ధ్య బంధంలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు. ఇక `మీలో ఎవరు కోటీశ్వరుడు` కార్యక్రమానికి చిరు హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడని తెలిసిన `మా` ఉద్యోగుల ఆనందానికి అవ‌ధులు లేవు. అయితే ఆ కార్యక్రమం వారికి చేదు అనుభవాన్ని మిగల్చడంతో పాటు మొత్తంగా ఉద్యోగాలకే ఎసరు పెట్టింది.

`మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు`.. మా టీవీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన కార్య‌క్ర‌మం. కింగ్ నాగార్జున‌తో స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాం మొద‌టి సీజ‌న్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. మంచి రేటింగుల‌తో పాటు డ‌బ్బులు కూడా కురిపించింది. త‌ర్వాత వ‌చ్చిన సీజన్లు మాత్రం ప్రేక్షుల‌కు ఆక‌ట్టుకోవడంలో విఫ‌ల‌మ‌య్యాయి. చిరంజీవి ని బుల్లి తెర మీదకు తెస్తూ చేస్తున్న ఈ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అవుతుందని స్టార్ యాజమాన్యం భావించింది. అయితే అనుకున్న ఫలితం రాలేదు. దీనికి కారణం ఉద్యోగుల్లో సృజనాత్మకత లేకపోవడమే అని స్టార్ మా యాజమాన్యం భావించిందట.

అందుకే ఇప్పుడు ఎన్టీఆర్తో ప్రారంభిస్తున్న‌ భారీ ప్రోగ్రాం `బిగ్ బాస్` మొదలయ్యే లోపు.. వృత్తిలో వెనకబడ్డారన్న కారణంతో దాదాపు 80 మందిని స్టార్ మా యాజమాన్యం గుడ్‌బై చెప్పేసింద‌ట‌. వీరిలో సంస్థతో ఏడెనిమిదేళ్లకి పైగా బంధం ఉన్న ఉద్యోగులు కూడా ఉన్నారు. పరిహారం కాస్త భారీగానే రావడంతో ఉద్యోగులు కూడా ఎదురు మాట్లాడలేకపోయారట. మరికొందరు సీనియర్ ఉద్యోగుల మెడ మీద కత్తి వేలాడుతోందట. వీరి స్థానంలో యువరక్తం తో సంస్థని నింపేందుకు `స్టార్ మా` ఇప్పటికే నియామక ప్రక్రియ మొదలెట్టిందట.