బాహుబ‌లిని చూసి చిరు వాత‌లు..!

ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. కోలీవుడ్‌లో ఆల్రెడీ హిట్ అయిన క‌త్తి సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమా అంత గొప్ప‌గా లేకున్నా మెగాస్టార్ ఛ‌రిష్మాతో ఇండ‌స్ట్రీ టాప్ హిట్ అయ్యి కూర్చుంది. వాస్త‌వానికి ఈ సినిమా నిర్మాణ విష‌యంలో చిరు స‌ల‌హా మేర‌కు నిర్మాత‌గా ఉన్న చెర్రీ చాలా సేఫ్ గేమ్ ఆడాడు. చాలా త‌క్కువుగా ఖ‌ర్చు చేశారు. దీంతో సినిమాకు మంచి లాభాలే వ‌చ్చాయి.

ఖైదీ నెంబ‌ర్ 150 బ‌డ్జెట్ విష‌యంలో కొణిదెల సంస్థ ఇంత పినాసిగా వ్య‌వ‌హ‌రించ‌డానికి చాలా కార‌ణాలే ఉన్నాయి. వీని బ్యాన‌ర్‌లో సొంతంగా తీసిన సినిమాలేవి వీరికి క‌లిసి రాలేదు. చిరు స్టార్ హీరోగా ఉన్న‌ప్పుడే నాగ‌బాబు అమ్మ పేరు మీద భారీ బ‌డ్జెట్‌తో త్రినేత్రుడు తీస్తే డిజాస్ట‌ర్ అయ్యింది. త‌ర్వాత రుద్ర‌వీణ పేరు తెచ్చినా న‌ష్టాలు మిగిల్చింది. త‌ర్వాత రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ష‌న్‌లో తీసిన ముగ్గురు మొన‌గాళ్లు కూడా తుస్సుమంది.

చిరు సొంత బ్యాన‌ర్‌లో తీసిన సినిమాల్లో బావ‌గారు బాగున్నారా మాత్ర‌మే బాగా ఆడింది. త‌ర్వాత చెర్రీతో నాగ‌బాబు తీసిన ఆరెంజ్ ప‌రిస్థితి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దీంతో వాళ్లు ఖైదీ నెంబ‌ర్ 150 విష‌యంలో చాలా లో బ‌డ్జెట్లోనే ప‌ని కానిచ్చేశారు. అయితే ఇప్పుడు చిరు 151వ సినిమా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి విష‌యంలో మాత్రం చెర్రీ అండ్ చిరు బ‌డ్జెట్ లిమిట్స్ పెట్టుకోవ‌డం లేదు. ఈ సినిమాను కూడా చెర్రీ త‌న సొంత బ్యాన‌ర్ అయిన కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లోనే తెర‌కెక్కిస్తున్నాడు.

బ‌డ్జెట్ లిమిట్ లేదంటున్నారు…తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌లు అంటున్నారు…హీరోయిన్‌గా ఐశ్వ‌ర్యారాయ్ పేరు వినిపిస్తోంది. ఈ హంగామా చూసిన ఇండ‌స్ట్రీ జ‌నాలు చిరు బాహుబ‌లిని టార్గెట్ చేసేందుకు ఆ సినిమాను చూసి వాత‌లు పెట్టుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంద‌న్న సెటైర్లు వేస్తున్నారు. చిరు అన‌వ‌స‌రంగా రిస్క్ చేస్తున్నాడ‌ని..రిజ‌ల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా అంద‌రూ నిండా మునుగుతార‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదన్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.