టీటీడీ చైర్మ‌న్ ఎంపిక‌లో బాబు న‌యా వ్యూహం

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయ‌కుడైన తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌న భాగ్యం ల‌భించ‌డ‌మే ఎన్నో జ‌న్మ ల పుణ్యం ఉండాలంటారు పెద్ద‌లు. అలాంటి శ్రీవారికి ఆయ‌న స‌న్నిధిలో సేవ‌చేసే భాగ్యం వ‌స్తే.. అది కూడా పాల‌క మండ‌లి చైర్మ‌న్ గా ప‌నిచేసే భాగ్యం ల‌భిస్తే.. అందుకే.. చాలా మంది ఒక్క‌సారైనా టీటీడీ చైర్మ‌న్ అయితే చాలు! అనుకుంటారు ఇప్పుడు ఆ చైర్మ‌న్ ప‌ద‌వి త్వ‌ర‌లోనే ఖాళీ కాబోతోంది. ప్ర‌స్తుతం ఉన్న చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి ప‌ద‌వి కాలం త్వ‌ర‌లోనే ముగియ‌నుంది.

దీంతో ఈ ప‌ద‌వికి ఎక్క‌డాలేని డిమాండ్ ఏర్ప‌డింది. తామంటే తాము శ్రీవారి సేవ చేస్తామ‌ని ముందుకు వ‌స్తున్న వారు కొంద‌రైతే.. ఈ ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డం అలిగిన వారు మ‌రి కొంద‌రు ఉన్నారు. ఇక‌, ఈ పోస్టును భ‌ర్తీ చేయ‌డంపై దృష్టి పెట్టిన సీఎం చంద్ర‌బాబు చాలా వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నార‌ట‌. తొలుత త‌న సొంత బావ‌గారైన నంద‌మూరి హ‌రికృష్ణ‌ను టీటీడీ చైర్మ‌న్‌గా చేయాల‌ని అనుకున్నారు. దీనికి కేవ‌లం నంద‌మూరి బాల‌కృష్ణ స‌ల‌హాను తీసుకోవ‌డమే లేటు అని నిన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది.

అయితే, అనూహ్యంగా బాబు ఈ ఆలోచ‌న నుంచి విర‌మించుకున్నారు. ఇప్ప‌టికే త‌న కుమారుడు లోకేష్‌కి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం, ఇప్పుడు టీటీడీ చైర్మ‌న్ పోస్టును హ‌రికి ఇవ్వ‌డం జ‌రిగితే.. ఏపీలో అంతా కుటుంబ పాల‌న జ‌రుగుతోందంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రేగే అవ‌కాశం ఉంద‌ని బాబు అనుకుంటున్నార‌ట‌. దీంతో ఈ ఆలోచ‌న‌కు ఫుల్ స్టాప్ పెట్టిన‌ట్టు తెలిసింది.

ఇక‌, ఈ పోస్టులో త‌న‌కు దీర్ఘ‌కాల మిత్రుడు, నాగార్జున కనస్ట్రక్షన్స్ అధినేత ఏవీఎస్ రాజు పేరును ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈయ‌నను పంప‌డం ద్వారా.. ఎలాంటి అప‌వాదులు లేకుండా ఉండ‌డంతోపాటు పారిశ్రామిక వ‌ర్గాల‌కు బాబు పెద్ద పీట వేస్తున్నార‌నే వార్త త‌న‌కు మేలు చేకూరుస్తుంద‌ని ఆయ‌న అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. మ‌రి రాబోయే రెండు మూడు రోజుల్లో దీనిపై నిర్ణ‌యం వెలువడే అవ‌కాశం ఉంది.