ఎమ్మెల్యే బ‌రిలో సీఎం.ర‌మేశ్‌….ఆ నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్ను..!

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకుంటున్నారా ? ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న ఆయ‌న మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదా ? ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ర‌మేశ్ ఇప్ప‌టికే ఓ సేఫ్ నియోజ‌క‌వ‌ర్గం కూడా చూసేసుకున్నారా ? అంటే క‌డ‌ప జిల్లా రాజ‌కీయాల్లో అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది.

చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా ముద్ర ఉన్న సీఎం.ర‌మేశ్‌కు ఇటీవ‌ల ఆయ‌న వ‌ద్ద ప్ర‌యారిటీ త‌గ్గుతూ వ‌స్తోంది. ఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం మ‌రో తొమ్మిది నెలలు మాత్రమే ఉంది. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. ర‌మేశ్ 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి చంద్రబాబు రాజ్యసభకు పంపారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని టీడీపీలోని అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల ద్వారా మ్యాట‌ర్ లీక్ అయ్యింది.

ఈ క్ర‌మంలోనే త‌న సొంత జిల్లా అయిన ప్రొద్దుటూరు నుంచి ఆయ‌న అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నారు. ఇప్ప‌టికే అక్క‌డ మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి వ‌ర్సెస్ వ‌ర‌ద‌రాజుల రెడ్డి మ‌ధ్య వార్ న‌డుస్తోంది. లింగారెడ్డికి కార్పొరేష‌న్ ప‌ద‌వి ఇవ్వ‌డంతో వ‌ర‌ద‌రాజుల రెడ్డి టిక్కెట్ త‌న‌దే అన్న ధీమాతో ఉన్నాడు. ఇటీవ‌ల ప్రొద్దుటూరు మునిసిప‌ల్ చైర్మ‌న్ ఎంపిక‌లో సైతం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి మాట‌కే విలువిచ్చారు.

ఇక ఇటీవ‌ల చంద్ర‌బాబు ర‌మేశ్ ప్ర‌యారిటీ త‌గ్గిస్తున్నారు. క‌డ‌ప జిల్లా అధ్య‌క్షుడిగా శ్రీనివాసుల‌రెడ్డిని త‌ప్పించేందుకు ర‌మేశ్ చేసిన ప్ర‌య‌త్నాలు బాబు వ‌ద్ద ఫెయిల్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే వ‌ర‌ద‌రాజుల రెడ్డి ప్రొద్దుటూరు టిక్కెట్ త‌న‌దే అన్న ధీమాతో ఉన్నారు. అయితే ర‌మేశ్ మాత్రం చంద్రబాబుతో తనకున్న పరిచయాలతో ఈసారి ఎలాగైనా ప్రొద్దుటూరు నుంచి పోటీ చేయాలని మాత్రం సీరియస్ గానే ప్రయత్నిస్తున్నారు. మరి సీఎం రమేశ్‌ ఆశలు నెరవేరతాయో? లేదో? చూడాల్సిందే.