`కారు`లో కోల్డ్‌వార్‌కు మ‌రో సాక్ష్య‌మిదిగో..

తెలంగాణ రాజ‌కీయాల్లో ఏదో జ‌రుగుతోంది! ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో కోల్డ్‌వార్ లేదని.. అంతా పైకి చెబుతున్నా.. లోలోన మాత్రం `అంత‌కుమంచి` అన్న రేంజ్‌లో లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. క్రెడిట్ గేమ్‌లో ఎప్పుడూ కేసీఆర్ మేన‌ల్లుడు, మంత్రి హ‌రీశ్‌రావు వెన‌క‌బ‌డిపోతున్నారా లేక కావాల‌ని ఆయ‌న‌కు క్రెడిట్ ద‌క్కకుండా చేస్తున్నారా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేసీఆర్ వెన్నంటే న‌డిచి.. కీల‌క స‌మ‌యాల్లో పార్టీని గ‌ట్టెక్కించి.. ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరుతెచ్చుకున్న హ‌రీశ్‌కు ఇప్పుడు క్రెడిట్ ద‌క్కుండా చేస్తున్నారనే గుస‌గుస‌లు పార్టీలో వినిపిస్తున్నాయి. శ్రీ‌రాంసాగ‌ర్ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వ‌ బాధ్య‌త‌లనుంచి హ‌రీశ్ త‌ప్పించ‌డం వెనుక కారణాలేంట‌నే చ‌ర్చ మొద‌లైంది.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌.. సాగునీటి ప్రాజెక్టుల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే! ఇందులో ఉత్త‌ర‌ తెలంగాణకు జీవ‌నాడి శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌. దీని కింద ఉన్న 18 లక్షల ఎకరాలకు నిరంతరం సాగు నీరు అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఒక మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టబోతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవం కోసం 1050 కోట్లతో రివర్స్ పంపింగ్ పథకానికి 10న శంకుస్థాపన చేయబోతు న్నారు. 1964లో ఎస్సారెస్పీ నిర్మాణం ఒక చరిత్ర సృష్టించింది. మళ్లీ ఈ నెల 10న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కేసీఆర్ మరో చరిత్ర లిఖించబోతున్నారు.

ఈ పథకం ఫలితంగా 100 కిలోమీటర్ల వరద కాలువ ఒకటిన్నర టీఎంసీ నీటితో మరో రిజర్వాయర్‌గా మారనుంది. ఈ పున‌రుజ్జీవ‌న ప‌థ‌కానికి ఒక రూపం తీసుకొచ్చింది సాగునీటి శాఖ మంత్రి హరీష్‌రావు. మొద‌టి నుంచి అధికారుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి సాధ్య‌సాధ్యాల‌ను ప‌రిశీలించారు. ఈ ప‌థ‌కం ఓకే కావ‌డంతో కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప‌థ‌కం గురించి మీడియాకు ఆయ‌నే వివ‌రించారు. రైతుల‌తో ఈ ప‌థ‌క ప్రారంభోత్స‌వం రోజు భారీ బ‌హిరంగ‌స‌భ‌ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే ఏమైందో ఏమో కానీ రెండు రోజుల త‌ర్వాత ఈ ప‌థ‌కం ప్రారంభో త్స‌వ బాధ్య‌త‌ల నుంచి హ‌రీష్‌రావును సీఎం కేసీఆర్‌ త‌ప్పించి మ‌రో మంత్రి ఈటల రాజేంద‌ర్‌కు అప్ప‌గించారు.

దీంతో ఏదో జ‌రిగి ఉంటుందనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క్రెడిట్ మొత్తం హ‌రీశ్ రావు కొట్టేయ‌కుండా ముంద‌స్తుగానే కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని గులాబీ వ‌ర్గంలో గుసగుసలు విన్పిస్తున్నాయ‌. ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ కారులో కోల్డ్‌వార్ ముదురుతోంది. అలాంటిదేమీ లేద‌ని హరీశ్ చెబుతున్నా.. ఆయ‌న వ‌ర్గీయుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి గూడుక‌ట్టుకుంది. ఇప్ప‌టికే చాలా సంద‌ర్భాల్లో హ‌రీశ్‌ను త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని వీరంతా ఆగ్ర‌హంతో ఉన్నారు. మ‌రి ఇది ఇలానే కొన‌సాగితే.. ముందు ముందు కేసీఆర్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు!!