ఏపీ సీఎం పేషీలో ఫైటింగ్‌

మేధావిగా, ఏ విష‌యంలోనైనా స‌బ్జెక్ట్‌ను చూసి స్పందిస్తార‌నే మంచి పేరున్న ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ చుట్టూ ఇప్పుడు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆధిప‌త్యం కోసం ఆయ‌న ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నార‌ని కొంద‌రు చెబుతున్నారు. ఆ నోటా.. ఈనోటా పాకి ఇప్పుడు ఈ విష‌యం సీఎం చంద్ర‌బాబు టేబుల్‌కు చేరింద‌ని స‌మాచారం. విష‌యం ఏంటంటే.. ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారుగా ఉన్న ప‌ర‌కాల‌కు, రాష్ట్ర స‌మాచార క‌మిష‌న‌ర్‌గా ఉన్న వేంక‌టేశ్వ‌ర్లుకు అస్స‌లు ప‌డ‌డం లేద‌ని ఎప్ప‌టి నుంచో వినిపిస్తోంది.

ఇరువురూ .. ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించాల‌ని ప్ర‌య‌త్నిస్తుండ‌డ‌మే దీనికి కార‌ణంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఏటా రెండు సార్లు ప్రభుత్వ పనితీరుపై మీడియాకు విడివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలు కూడా కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా., అందులో ప్రభుత్వ అనుకూలమైన వ్యక్తులకు ఇస్తుంటారు.

తొలి రెండేళ్లు ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ కనుసన్నల్లో ఈ తంతు సాగింది. ఆ తర్వాత ఐ అండ్‌ పిఆర్‌ కమిషనర్‌గా వెంకటేశ్వర్‌ రావడంతో మీడియా ఎంపిక బాధ్యత ఆయన భుజానికెత్తుకున్నారు. ఈ విష‌యం వివాదానికి బీజం వేసింది.

ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునే క్రమంలో ముఖ‌్యమంత్రికి చికాకు తెప్పిస్తోంది. ఇటీవల పరకాలకు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ వార్త రావడం వెనుక ప్రత్యర్ధులు ఉన్నారని పరకాల అనుమానిస్తున్నారు. నిజానికి గవర్నర్‌ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీల కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఒక స్థానాన్ని తమకు కేటాయించాలని బీజేపీ ఒత్తిడి చేస్తోంది.

మిగిలిన ఒక్క స్థానాన్ని ఎవరికి ఇస్తారనే విష‍యంలో ఇంకా క్లారిటీ లేదు. అనూహ్యంగా పరకాల పేరు తెరపైకి రావడంలో కుట్ర ఉందని పరకాల అనుమానిస్తున్నారు. త‌న‌ను ఏదో విధంగా బ‌య‌ట‌కు సాగ‌నంపేందుకు సీఎంవోలో కుట్ర జ‌రుగుతోంద‌ని ఆయ‌న త‌న స‌న్నిహితుల‌తో చెప్పిన‌ట్టు స‌మాచారం. మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.