ఆ జిల్లా టీడీపీలో ముదిరిన ముస‌లం

కంచుకోట‌లో కుమ్ములాట‌లు భ‌గ్గుమంటున్నాయి. తెలుగు దేశంల నాయ‌కుల మ‌ధ్య విభేదాలు తార‌స్థాయికి చేరుతున్నాయి. ఆది నుంచి టీడీపీకి అండ‌గా నిలుస్తున్న అనంత‌పురం జిల్లాలో కీల‌క నేత‌ల మ‌ధ్య ప‌ద‌వుల పోటీ నెల‌కొంది. ఎవరికీ వారే తమ వారికి పదవులు దక్కేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతల మధ్య విభేదాలకు దారితీస్తుంది. జిల్లాకు అనేక పదవులను కట్టబెట్టారు సీఎం చంద్రబాబు..ఇప్పుడు ఆ పదవులే పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారాయి.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీకి అనంత‌పురం జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడతారు. తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఆయ‌న త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ కూడా హిందూపురం నుంచే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇక్కడి ప్రజలు టీడీపీకి అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 12స్థానాలతో పాటు జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు సీట్లను ఆ పార్టీకి కట్టబెట్టారు.

ఇవికాక.. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌, ఇతర మున్సిపాలిటీలు, జిల్లాపరిషత్ విషయంలోనూ టీడీపీకి తిరుగులేని మెజారిటీ అందించారు. దీంతో ఈ జిల్లాపై చంద్ర‌బాబుకు ప్ర‌త్యేక అభిమానం ఉంది. ఇంతటి విజ‌యాలు అందించిన నేత‌ల‌కు కీల‌క‌ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. దీంతో నేతల్లో పదవుల పందేరం మొదలైంది. ప్ర‌స్తుతం జడ్పీ చైర్మన్ విషయంలో పోటీ పార్టీ అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్న దూదేకుల చమన్‌ను ఆ పదవి నుంచి తప్పించి గుమ్మగట్ట జడ్పీటీసీ పూల నాగరాజుకు కట్టబెట్టేందుకు కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. దీంతో ప్రస్తుత చైర్మన్ చమన్ తనకు మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు.

దివంగత నేత పరిటాల రవికి చ‌మ‌న్ అత్యంత సన్నిహితుడు. కాగా తాను పార్టీ కోసం అన్నీ కోల్పోయావని.. ఇప్పుడు పదవి కోల్పోతే తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు పూల నాగరాజుకు చైర్మన్ పదవి ఇవ్వాలని ఆ వర్గం నేతలు పట్టుబడుతు న్నారు. చైర్మన్ పదవి నిర్ణయాన్ని సీఎం చంద్రబాబుకే ఇరు వర్గం నేతలు వదిలేశారు. చంద్ర‌బాబు అమెరికా పర్యటన అనంతరం ఈ విభేదాలకు చెక్ పడుతోందని జిల్లా టీడీపీ క్యాడర్ ఆశిస్తోంది. లేక‌పోతే ఇప్ప‌టికే జిల్లాలో హిందూపురంలో కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితులకు తోడు ఇది కూడా స‌మ‌స్య‌గా మారుతుంది.