సైకిల్ గుర్తు వ‌ద్దు.. క‌మ‌లంపై పోటీ చేస్తాం

బీజేపీ-టీడీపీ పొత్తు రెండు రాష్ట్రాల్లో వింత‌గా ఉంది. ఒక‌చోట టీడీపీ బ‌లంగా ఉంటే.. మ‌రోచోట బీజేపీ బ‌లాన్ని పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఒకచోట సొంతంగా ఎదిగేందుకు బీజేపీ ఆరాట‌ప‌డుతుంటే.. మరోచోట అస్థిత్వం కోసం టీడీపీ పోరాడుతోంది. క‌ల‌హాలు ఉన్నా ఏదోలా ఇన్నాళ్లూ జోడీ బండిని లాక్కుంటూ వస్తున్నారు. ఏపీలో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణ‌లో మాత్రం వింతైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే టీటీడీపీ నాయ‌కులు స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చార‌ట‌. పార్టీని విలీనం చేయ‌కుండానే.. బీజేపీ జెండాతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నే వ్యూహాన్ని అధినేత సీఎం ముందుఉంచార‌ట!!

తెలంగాణలో టీడీపీ పరిస్థితి అయోమయంగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకులు, అన్నిచోట్లా భవనాలు యంత్రాంగం ఉన్నా విధానం లేక‌పోవ‌డంతో వెనుక‌బడుతోంది. ఫిరాయింపులు ఒకవైపు, ఓటుకు నోటుతో పోటు మరో వైపు కుదిపేశాయి. ఇది చాలక బీజేపీ నాయకత్వం కూడా తెలంగాణలో వారితో పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టి చెప్పేసింది. ఈ పరిస్థితిలో భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌పై అమరావతిలో చంద్రబాబు నాయుడుతో సమావేశమై వచ్చారు. ముందస్తుకు సన్నద్ధం కావాలని చెప్పిన ఆయన బీజేపీతో సంబంధాల విషయం చెప్పలేకపోయారు. వారు స్వంతంగా పెరగాలనుకోవడం తప్పు కాదు అని ఆమోదముద్ర వేశారు.

ఇక్క‌డే టీటీడీపీ నేత‌లు మెలిక‌ పెట్టారు. `మాకు ఎన్‌డీఏ పేరిట, బీజేపీ గుర్తుపై పోటీ చేసేందుకు అవకాశం క‌ల్పించండి` అని అడిగారట. `నేను వారి జాతీయ నాయకులతో మాట్లాడతానం`టూ చంద్రబాబు సరిపెట్టేశారు. ఈ విషయమై బీజేపీలోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. `వారు వచ్చి చేరితే వేరే విషయం గాని మనుగడ కాపాడుకుంటూ మన గుర్తుపై పోటీ ఏమిట`ని రాష్ట్ర నాయకులు ప్రశ్నిస్తున్నార‌ట‌. జాతీయ అవసరాలు దృష్టిలో పెట్టుకుని మరోసారి చర్చిస్తామని రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్‌ చెబుతున్నారు.

స్వతహాగా వెంకయ్య నాయుడుకి దగ్గరగా ఉండే లక్ష్మణ్‌.. ఏపీ విషయంలోనూ తమ అవసరాలను బట్టి కొంత సర్దుబాటు పాట పాడుతున్నారు. పొత్తు ప్రసక్తేలేదని గతంలో కొందరు నాయకులు చెప్పిన దానికి ఇది కొంత భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.