ఏపీ బీజేపీలో నిప్పు – ఉప్పు

ఏపీ బీజేపీ వింత ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని ఒక‌ప‌క్క పార్టీ అధిష్టానం తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్న త‌రుణంలో.. కీల‌క‌మైన ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కొర‌వ‌డింది. పార్టీని ముందుండి నడిపించాల్సిన నేత‌లు.. చెరో దారి ప‌ట్టారు. ఇందులో ఒక‌రికి కేంద్ర మాజీ మంత్రి వెంక‌య్య‌నాయుడి మ‌ద్ద‌తు పూర్తిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆయ‌న కూడా ఢిల్లీకే ప‌రిమిత‌మయ్యారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న ఆ ఇద్ద‌రు నేత‌ల‌కూ స‌ర్దిచెబుతూ వ‌స్తున్నారు. ఇప్పుడు ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో లేక‌పోవ‌డంతో పాటు రాజ‌మండ్రి ఎమ్మెల్యే సీటు విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ఫైట్ మొద‌లైంది. మ‌రి అధిష్టానం వీరి మ‌ధ్య వార్‌ను ఎలా ప‌రిష్క‌రిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

ఏపీ బీజేపీలో బాగా వినిపించే పేర్లు ఆకుల స‌త్యనారాయ‌ణ‌, సోము వీర్రాజు!! ప్ర‌స్తుతం వీరి వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. తూర్పుగోదావ‌రి జిల్లా రాజమండ్రి నుంచి పోటీచేసేందుకు ఎవ‌రికి వారు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ప్ర‌స్తుతం రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిం చారు ఆకుల సత్యనారాయణ. గత ఎన్నికల్లోనే ఎంపీ స్థానానికి చివరిదాకా ట్రై చేశారు. సోము వీర్రాజు ప్రోద్బ లంతో ఎంపీ సీటు గ్యారంటీ అని భావించి రంగంలోకి దిగారు. టీడీపీతో పొత్తు కారణంగా ఆయ‌న‌ అమలు కాలేదు . ఎంపీ టికెట్ టీడీపీకి కేటాయించారని తెలిసి ఎమ్యెల్యేగా పోటీ చేసేందుకు విముఖ‌త తెలిపారు.

రాజమండ్రి ఎమ్యెల్యేగా విజయం సాధించిన కొద్ది కాలానికే సోము వీర్రాజు తో ఆకులకు విభేదాలు పొడచూపాయి. అవి ఏ స్థాయిలో అంటే పార్టీ ఇచ్చే కార్యక్రమాలు చాలా వరకు రెండు వర్గాలు విడి విడిగా చేసుకునే అంత. తప్పనిసరి కార్యక్రమాల్లో తప్ప ఇరువురు నేతలు ఒకే వేదిక మీద కనిపించడం చాలా అరుదు. నిన్న మొన్నటి వరకు కేంద్ర మంత్రి గా ఉండి ఉపరాష్ట్రపతి కాబోతున్న వెంకయ్య నాయుడు ఆశీస్సులు ఆకులకు మెండుగా ఉన్నాయి . ఆయన సహకారంతో ఆకుల దూసుకుపోయేవారు. ఇప్పుడు వెంకయ్య నాయుడు క్రియా శీల రాజకీయాలకు దూరంగా ఉండే పరిస్థితి వ‌చ్చింది. ఇది ఆకులకు మైనస్ గా మారింది.

మరో పక్క రాంమాధవ్ దూకుడు ఏపీ, తెలంగాణాలో ఇక బీజేపీలో పెరగనుంది. రాంమాధవ్ తో ఎమ్మెల్సీ సోము సన్నిహితంగా ఉండే వారు కావడంతో ఇప్పుడు ఆయన హవా ప్రారంభం కావొచ్చనే టాక్ న‌డుస్తోంది. ఇదే స‌మ‌యంలో సోము వీర్రాజు ఇప్పుడు రాజ‌మండ్రి ఎంపీ టికెట్ కోసం ఇద్ద‌రి మ‌ధ్య ఫైటింగ్ మొద‌లైంద‌ట‌. దీంతో ఆకులకు ఈసారి కూడా ఎంపీ సీట్ కు అడ్డంకులు ఎదురు కావొచ్చన్నది విశ్లేషకులు భావిస్తున్నారు. మ‌రి వీరిద్ద‌రి మ‌ధ్య పోటీలో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో వేచిచూడాల్సిందే!!