ఎవరి వైపు వెళ్లాలో తెలియక డైలమాలో కార్యకర్తలు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ వేయ‌ని ప్లాన్లు లేవు..ప‌న్న‌ని వ్యూహాలు లేవు… చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. అయితే జ‌గ‌న్ ఎలా ఉన్నా చాలా జిల్లాల్లోని..చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల మ‌ధ్య గ్రూపు విబేధాల‌తో కొట్టుకుంటూ పార్టీకి తీర‌ని న‌ష్టం క‌లిగిస్తున్నారు. టీడీపీ బ‌లంగా ఉన్న‌, ఏపీలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావ‌రి జిల్లాలో వైసీపీ నాయ‌కుల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు. జిల్లాలో మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇద్ద‌రేసి కోఆర్డినేట‌ర్లు ఉండ‌డంతో ఒక‌రు ఎడ్డెం అంటే మ‌రొక‌రు తెడ్డెం అంటున్నారు. దీంతో పార్టీ క్యాడ‌ర్ ఎవ‌రి వైపు వెళ్లాలో తెలియ‌క డైల‌మాలో ప‌డుతోంది.

జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి అయిన మండ‌పేట నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వేగుళ్ల ప‌ట్టాభిరామ‌న్న పోటీ చేసి ఓడిపోయారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌తో పాటు ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీలో చేరిన వేగేళ్ల లీలాకృష్ణ ఇద్ద‌రిని జ‌గ‌న్ కోఆర్డినేట‌ర్లుగా నియ‌మించారు. దీంతో ఇప్పుడు మండ‌పేట వైసీపీలో ప‌ట్టాభిరామ‌న్న వ‌ర్సెస్ లీలాకృష్ణ మ‌ధ్య ఫైటింగ్ న‌డుస్తోంది. ఇక మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం అయిన రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్‌లోనే ప‌రిస్థితి ఇంత‌క‌న్నా దారుణంగా ఉంది.

గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆకుల వీర్రాజు ఓ కోఆర్డినేట‌ర్ కాగా, గిర‌జాలు బాబు మ‌రో కో ఆర్డినేట‌ర్‌. ఇక గ‌తేడాది పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్‌ను గ్రేట‌ర్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కో ఆర్డినేట‌ర్‌గా నియ‌మించారు. అయితే ఆయ‌న మాత్రం రూర‌ల్ నుంచి పోటీ చేసేందుకు ఆస‌క్తితో ఉన్నారు. దీంతో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ వైసీపీలో మూడు ముక్క‌లాట మొద‌లైంది. ఇక సిటీ నియోజ‌క‌వ‌ర్గ కో ఆర్డినేట‌ర్‌గా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య‌ప్రకాశ్ రావు ఉన్నారు.

కాకినాడ సిటీలోను అంతే….

కాకినాడ సిటీలో ప్ర‌స్తుత కో ఆర్డినేట‌ర్‌గా ముత్తా శ‌శిధ‌ర్ ఉండ‌గా జ‌గ‌న్ రెండు రోజుల క్రితం ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిని మ‌రో కో ఆర్డినేట‌ర్‌గా వేశారు. దీంతో ఈ ఇద్ద‌రిలో ఎవ‌రికి టిక్కెట్ వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక ఇద్ద‌రు కో ఆర్డినేట‌ర్లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వీరు వేర్వేరు ఊళ్ల‌లో గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. దీంతో పాటు కోన‌సీమ‌లోని ప‌లు నియోజ‌క‌వర్గాల్లోను ఇదే ప‌రిస్థితి ఉంది. ఈ లెక్క‌న చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల వేళ తూర్పు వైసీపీలో టిక్కెట్ల కోసం ఫైటింగ్ మామూలుగా ఉండేలా లేదు.