వైసీపీ + కాంగ్రెస్ పొత్తు

ఈ హెడ్డింగ్ చూడ‌డానికి కాస్త విచిత్రంగానే ఉండొచ్చు. వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ కాంగ్రెస్‌తోనే విబేధించి వైసీపీ పెట్టాడు..మ‌రి అలాంటి జ‌గ‌న్ అదే కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటాడ‌న్న‌ది పెద్ద క్వ‌శ్చ‌నే. అయితే అప్పుడు జ‌గ‌న్ సీఎం పోస్టు కోస‌మో లేదా మ‌రో అవ‌స‌రం కోస‌మో కాంగ్రెస్‌తో విబేధించి వైసీపీ పెట్టి ఉండొచ్చు….అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ ప‌రిస్థితి ఏపీ వ‌ర‌కు (ఆ మాట‌కు వ‌స్తే దేశంలోను ఏమంత గొప్ప‌గా లేదు) స‌మాధికి చేరువుగా ఉంది.

శ‌తాబ్దం చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేనంత దుస్థితికి జారీపోయింది. దీంతో ఇప్పుడు అదే కాంగ్రెస్ జ‌గ‌న్‌తో జ‌ట్టుకోసం వెంప‌ర్లాడుతోంది. తాజాగా గుంటూరులో ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన స‌భ‌కు ముందే కాంగ్రెసోళ్లు జ‌గన్‌ను ఆహ్వానించారు. ఇక స‌భ‌లోను జాతీయ స్థాయి నాయ‌కులు జ‌గ‌న్ జ‌పం చేసేశారు.

ఈ స‌భ‌కు వ‌చ్చిన జాతీయ నాయ‌కుల్లో జేడీయూ నేత శరద్ యాదవ్, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. శరద్ యాదవ్ జ‌గ‌న్ త‌మ‌తో క‌లిసి రావాల‌ని ఓపెన్‌గా చెప్పేశారు. ఇక రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఎన్డీయే అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కూడద‌ని కూడా చెప్పారు. ఇక యూపీ మాజీ సీఎం అఖిలేశ్ సైతం జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తేనే బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్న ష‌ర‌తు పెట్టాల‌ని జ‌గ‌న్‌కు సూచించారు.

ఈ నేత‌ల సంగ‌తి ఇలా ఉంటే వైసీపీతో పొత్తుకోసం కాంగ్రెస్ త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఇక్క‌డ టీడీపీ+బీజేపీ పొత్తు ఉంటుంద‌నే న‌మ్ముతోన్న కాంగ్రెస్ జ‌గ‌న్‌ను ఏదోలా త‌మ వైపున‌కు తిప్పుకోవాల‌ని భావిస్తోంది. ఇక బీజేపీతో పొత్తుకు త‌హ‌త‌హ‌లాడుతోన్న వేళ జ‌గ‌న్ కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తాడు ? ఒక‌వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ+బీజేపీ పొత్తే ఉంటే కాంగ్రెస్ అంత‌గా జ‌గ‌న్ వెంట‌ప‌డితే కాంగ్రెస్‌ను క‌మ్యూనిస్టు పార్టీల గాటిన క‌ట్టేసి వాళ్ల‌కు ఒక‌టో రెండో సీట్లు ఇచ్చి జ‌గ‌న్ పొత్తు పెట్టుకుంటాడేమో ? అంత‌కు మించి ఏం జ‌ర‌గ‌దు.