కొత్త టార్గెట్‌: ముందు జ‌గ‌న్‌.. త‌ర్వాత చంద్ర‌బాబు

అధికార పార్టీ నాయ‌కులు చేసే అవినీతి, ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళితే.. ప్ర‌తిప‌క్షానికైనా, ఇత‌ర పార్టీల‌కైనా మ‌నుగ‌డ ఉంటుంది. అప్పుడే ఆయా పార్టీల బ‌లం పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌స్తోంది. కానీ దీనికి భిన్నంగా ఏపీ కాంగ్రెస్ నిర్ణ‌యించింది. టీడీపీని కాకుండా .. ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్‌సీపీ అధినేత జ‌గ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకోవాల‌ని హైక‌మాండ్ నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీఅయ్యాయ‌ట‌. దీని వెనుక బ‌ల‌మైన కార‌ణం కూడా లేక‌పోలేద‌ట‌. అందుకే ఇక ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఆప‌రేష‌న్ జ‌గ‌న్ మొద‌లుపెట్టాల‌ని సంకేతాలు వ‌చ్చేశాయని సమాచారం.

కాంగ్రెస్ హైక‌మాండ్‌కు, వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్‌కు మ‌ధ్య వార్ తెలిసిందే! వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత‌.. సీఎం కుర్చీ కోసం జ‌రిగిన వార్‌.. త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో.. జ‌గ‌న్ కాంగ్రెస్‌ను వీడి సొంత కుంప‌టి పెట్టుకోవ‌డం విధిత‌మే! త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో విభ‌జ‌న ప్ర‌భావం వ‌ల్ల కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు చీలిపోయింది. ఇది కాంగ్రెస్‌ను తీవ్రంగా దెబ్బ‌తీసింది. అప్ప‌టి నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా వైసీపీతోనే ఉంది. ఇప్పుడుఇదే అంశంపై కాంగ్రెస్ హైక‌మాండ్‌ దృష్టిసారిం చింది. తిరిగి త‌న ఓటు బ్యాంకును ద‌క్కించుకునేందుకు ప్ర‌యత్నిస్తోంది.

ఓటు బ్యాంకును త‌మ వైపు ఆక‌ర్షించ‌డం ద్వారా ఏపీలో పార్టీకి జ‌వ‌స‌త్వాలు నింపాల‌ని నిర్ణ‌యించుకుంది.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి చావుదెబ్బ త‌గిలింది. అప్ప‌టి నుంచీ కోలుకోవ‌డం కోసం ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏపీ కాంగ్రెస్ నేత‌లు ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ నేత‌ల్ని హుటాహుటిన ఢిల్లీకి కాంగ్రెస్ అధిష్టాన పెద్ద‌లు పిలిచి, రాబోయే రోజుల్లో అనుస‌రించాల్సి వ్యూహాల్ని వివ‌రించారు. ఆ వ్యూహం ఏంటంటే.. ఎటాక్ జ‌గ‌న్‌..! ఏపీ నేత‌లు విమ‌ర్శించాల్సిందీ, టార్గెట్ చేయాల్సింది సీఎం చంద్ర‌బాబును కాద‌నీ, విప‌క్ష నేత జ‌గ‌న్‌ను అని స్ప‌ష్టంచేశారు! గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ చ‌తికిల ప‌డటానికి కార‌ణం వైకాపా అనీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా ఆ పార్టీవైపు ట‌ర్న్ కావ‌డంతోనే కాంగ్రెస్ కి దెబ్బ ప‌డింద‌ని లెక్క‌ల‌తో స‌హా హైక‌మాండ్ విశ్లేషించిన‌ట్టు స‌మాచారం.

కాబ‌ట్టి, ఆ ఓటు బ్యాంకును తిరిగి ర‌ప్పించుకోవాలంటే జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు పెంచాల‌ని రాష్ట్ర నేత‌ల‌కు సూచించిన‌ట్టు చెబుతున్నారు. గ‌తంలో వైఎస్ సీఎంగా అమ‌లు చేసిన ప‌థ‌కాలు, ప్రారంభించిన ప్రాజెక్టులూ స్కీములూ అన్నీ జ‌గ‌న్ ఖాతాలో ప‌డ‌కుండా చూడాల‌ని… అవ‌న్నీ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజ‌యాలుగా ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని వివ‌రించార‌ట‌ వైఎస్‌ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ లో ఉండ‌టం వ‌ల్ల‌నే రాష్ట్రానికి ఆ రేంజిలో ప్ర‌యోజ‌నాలు చేకూరాయ‌నే ప్ర‌చారం చేయాల‌ని రాష్ట్ర నేత‌ల‌కు హై క‌మాండ్ సూచించిందట‌. మ‌రి కాంగ్రెస్ రివ‌ర్స్ వ్యూహం ఫ‌లిస్తుందో లేదో వేచిచూడాల్సిందే!