టీడీపీకి సైకిల్ క‌ష్టాలు

తెలుగు రాజ‌కీయాల్లో సుస్థిర‌మైన స్థానం సంపాదించుకున్న ఘ‌న‌త తెలుగుదేశం పార్టీది. దివంగ‌త మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాప‌క‌స‌భ్యుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం తెలుగు గ‌డ్డ‌పై ద‌శాబ్దాల పాటు అప్ర‌తిహ‌తంగా జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోన్న జాతీయ కాంగ్రెస్‌ను మ‌ట్టిక‌రిపించి తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ సైకిల్ గుర్తును త‌న పార్టీ ఎన్నిక‌ల చిహ్నంగా ఎంచుకున్నారు. నాడు ఎన్టీఆర్ సీఎంగా సైకిల్‌పైనే అసెంబ్లీకి వెళ‌తాన‌ని చెప్పి అలాగే చేసి రికార్డు సృష్టించారు.

ఆ త‌ర్వాత టీడీపీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఇప్పుడు ఏపీలో అధికారంలోకి వ‌చ్చింది. మ‌ధ్య‌లో ఓ సారి గుర్తు కోసం స‌మాజ్‌వాద్ పార్టీతో సైతం ఫైట్ చేసింది. తెలుగు నేల‌పై రాజ‌కీయంగా ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన సైకిల్ ఇప్పుడు కొత్త క‌ష్టాలు ఎదుర్కొంటోంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు ఆయ‌న సైకిల్ తొక్కుకుంటూ ముందుకు వెళుతుంటే ఆయ‌న వెన‌క కొన్ని వేల‌మంది సైకిళ్ల‌తో వ‌చ్చేవారు.

క‌ట్ చేస్తే కాల‌క్ర‌మంలో సైకిళ్లు క‌రువైపోయాయి. ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో బైక్‌లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇప్పుడు సైకిళ్ల రాజ్యం పోయి బైక్‌ల రాజ్యం న‌డుస్తోంది. దీంతో సైకిళ్లు లేకుండా పోయాయి. టీడీపీ నాయ‌కులు సైకిల్ ర్యాలీ అని పెడితే ప‌ట్టుమ‌ని 10 సైకిళ్లు కూడా రావ‌డం లేదు. తాజాగా విజ‌య‌వాడ‌లో ఆ పార్టీ యువ నాయ‌కుడు దేవినేని అవినాష్ భారీ సైకిల్ ర్యాలీ నిర్వ‌హించారు.

ఈ ర్యాలీ స‌గం ముగిసే స‌రికి ప‌ట్టుమ‌ని 10 సైకిళ్లు కూడా లేవు. దీంతో ఆయ‌న 200 సైకిళ్ల‌ను అద్దెకు తెప్పించారు. ఈ లోగా అక్క‌డ‌కు యూత్ నాయ‌కులు బైక్‌లు, ఆటోల్లో దిగారు. దీంతో అద్దె సైకిళ్ల‌తో అవినాష్ సైకిల్ ర్యాలీ మ‌మ అనిపించేశారు. ఈ ప‌రిస్థితి ఒక్క అవినాష్‌దే కాదు. టోట‌ల్ టీడీపీ నాయ‌కులు అంద‌రూ ఇదే ప‌రిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏదేమైనా తెలుగు రాజ‌కీయాల్లో సైకిల్‌తో ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసి సైకిల్ ఇప్పుడు టీడీపీ వాళ్ల‌కే దొర‌క‌డం లేదు.