కేసీఆర్‌కి ఝ‌ల‌క్‌..టీఆర్ఎస్‌కి తొలి దెబ్బ!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో? ఎవ‌రు ఎప్పుడు ఎలా మార‌తారో? ఎప్పుడు ఎవ‌రితో ఎలాంటి అనుబంధం ఏర్ప‌డుతుందో? ఎప్పుడు ఎవ‌రు ఎవ‌రితో అనుబంధాన్ని క‌ట్ చేసుకుంటారో? చెప్ప‌డం అంత వీజీకాదు!! కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్న నేత‌లు ఆ త‌ర్వాత క‌త్తులు దూసుకున్న ప‌రిస్థితులు మ‌న తెలుగు నాట కొత్త‌కాదు. అదేస‌మ‌యంలో క‌త్తులు నూరుకుని.. ఆన‌క అవ‌స‌రార్ధం కౌగిలింత‌ల‌కు సిద్ధ‌మైన నేత‌లూ మ‌న‌కు తెలుసు. ఇప్పుడు ఇదే జాబితాలో చేర‌నున్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ధ‌ర్మపురి శ్రీనివాస్ ఉర‌ఫ్ శీన‌న్న‌. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్‌ను ప్ర‌జ‌లు దూరం చేయ‌డంతో ఆయ‌న రాజ‌కీయ అస్థిత్వం కోసం అధికార టీఆర్ ఎస్ పంచ‌కు చేరిన విష‌యం తెలిసిందే.

దీంతో వెనుకా ముందూ ఆలోచించ‌కుండా కాంగ్రెస్ పెద్ద త‌ల‌కాయ‌ల‌ను బుట్ట‌లో వేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్‌.. శీన‌న్న‌ని స‌ల‌హా దారుగా త‌ర్వాత రాజ్య‌స‌భ స‌భ్యుడిగా చేశారు. దీంతో కాంగ్రెస్‌లో మిస్స‌యిన‌ రాజ‌భోగాలు టీఆర్ ఎస్‌లో అందుకున్నారు డీఎస్‌. అయితే, అనూహ్యంగా డీఎస్‌కు టీఆర్ ఎస్‌లో ఏదో వెలితి ఏర్ప‌డింది. త‌న‌కు గౌర‌వం త‌గ్గింద‌ని, త‌న స‌ల‌హాను అడిగేవారే క‌రువ‌య్యార‌ని ఆయ‌న ఫీల‌య్యాడట‌. అంతే, ఇంకే ముంది.. ఎలాగూ పాత గూడు ఉంది క‌దా!! అక్క‌డికే ట్రై చేశాడు డీఎస్‌. అదికూడా రాష్ట్ర నేత‌ల‌కు తెలియ‌కుండా కేంద్రంలో కాంగ్రెస్ అధిష్టానాన్నే ఒప్పించేశాడ‌ట‌. అంతా సైలెంట్‌గా జ‌రిగిపోయిన ఈ తతంగం.. ఇటీవ‌ల కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్తే.. బ‌య‌ట‌ప‌డింది.

తెలంగాణాలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా సోనియా గాంధీని కలిశారట. ఆమె మాటల్లో డీఎస్ సలహాలు కూడా తీసుకోమని చెపితే ఆయన పార్టీ మారిన విషయాన్ని ఉత్తమ్ గుర్తు చేశారట. అయినా పర్లేదు అని సోనియా జవాబు ఇవ్వడంతో డీఎస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్టు ఉత్తమ్ కి అర్ధం అయ్యిందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019 లో కూడా తెలంగాణాలో కాంగ్రెస్ అవకాశాలు అంతగా కనిపించడం లేదు.అయినా డీఎస్ కాంగ్రెస్ వైపు మొగ్గుజూపడానికి టీఆర్ ఎస్‌లో ఎదురైన అవమానాలే కారణం అంటున్నారు. డీఎస్ సొంత గూటికి చేరుకుంటే తెలంగాణ ఏర్పడ్డాక రాజకీయంగా టీఆర్ ఎస్‌కి తగిలిన తొలి దెబ్బ అవుతుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.