విజ‌య‌వాడ ఎంపీ సీటుపై పురందేశ్వ‌రి క‌న్ను..!

ఎన్టీఆర్ కూతురిగా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి ముందుగా ఎన్టీఆర్ కుమార్తెగా రాజ‌కీయాల్లో పునాది వేసుకున్నా త‌ర్వాత ఆమె ఛ‌రిష్మాతో పాటు సొంత టాలెంట్‌తో దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది రాజ‌కీయ దిగ్గ‌జాల‌తో శ‌భాష్ అనిపించుకున్నారు. ప‌దేళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో సోనియాగాంధీ ద‌గ్గ‌ర ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పిన పురందేశ్వ‌రి కేంద్ర మంత్రిగా కూడా ప‌నిచేశారు.

2014 ఎన్నిక‌ల‌కు ముందు ఏపీలో కాంగ్రెస్ ప‌నైపోవ‌డంతో ఆమెతో పాటు ఆమె భ‌ర్త ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ బీజేపీలో చేరిన‌ప్పటి నుంచి చూస్తుంటే ఆమెను అస్స‌లు బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ప‌ట్టించుకుంటోందా ? అన్న డౌట్లు రాక‌మాన‌వు. రాష్ట్ర విభజన సమయం ముందు వరకూ రాజకీయాల్లో హీరో అనిపించుకున్న పురందేశ్వ‌రి ఆ త‌ర్వాత బాగా డౌన్ అయ్యారు.

ఇక ఆమె బీజేపీలో చేరినా బీజేపీ ఆమెను గుర్తొచ్చిన‌ప్పుడు వాడుకుంటోందే త‌ప్ప ఆమెకు అక్క‌డ స‌రైన గుర్తింపు అంటూ లేదు. తాజాగా ఆమెకు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. చంద్ర‌బాబు కేబినెట్ విస్త‌ర‌ణ‌లో ఫిరాయింపుదారుల‌కు చోటు ఇవ్వడాన్ని త‌ప్పుప‌డుతూ చిన్న‌మ్మ అమిత్ షాకు లేఖ రాశారు. ఇప్ప‌టికే గోవా, మ‌ణిపూర్‌ల‌లో ఫిరాయింపుదారుల‌తో బీజేపీ ప్ర‌భుత్వాలు న‌డుస్తున్నాయి. ఈ ప్ర‌భుత్వాల ఏర్పాటుపై బీజేపీపై విమ‌ర్శ‌లు వస్తుంటే మ‌రోవైపు ఇదే విష‌యంలో టీడీపీని చిన్న‌మ్మ టార్గెట్ చేస్తూ లేఖ‌రాయ‌డం బీజేపీ పుండుపై కారం చ‌ల్లిన‌ట్ల‌య్యింది.

ఇదిలా ఉంటే బీజేపీలో ఇమ‌డ‌లేక‌పోతోన్న పురందేశ్వ‌రి చూపులు వైసీపీ వైపు ఉన్న‌ట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరి ఆమె విజ‌య‌వాడ ఎంపీ సీటు నుంచి పోటీ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నట్టు వార్త‌లు వస్తున్నాయి. ఎన్టీఆర్ కుమార్తెగా ఎంతో ఛ‌రిష్మా ఉన్న పురందేశ్వ‌రి వైసీపీలో చేరితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇప్పటివరకు కొంచెం వీక్ గా వున్నా YSR కాంగ్రెస్ పార్టీకి కొంత బలం చేకూరుతుంది. చూదాం చిన్నమ్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో.