పురందేశ్వ‌రి వ్యాఖ్య‌లతో టీడీపీలో కలకలం

సొంత వ‌దినా, మ‌రిది అయినా మాజీ కేంద్ర మంత్రి, ప్ర‌స్తుత బీజేపీ నేత ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి, ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబాల మ‌ధ్య ఉప్పు నిప్పు వాతావ‌ర‌ణం ఉంది. ఈ రెండు కుటుంబాల వారు ఇటీవ‌ల స‌రిగా మాట‌లే లేవ‌న్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయంగా చంద్ర‌బాబుతో విబేధించి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ద‌గ్గుపాటి దంప‌తులు ప‌దేళ్ల పాటు అక్క‌డ మంచి పొజిష‌న్‌లో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరిన ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి రాజంపేట నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోవ‌డంతో రాజ‌కీయంగా ఎప్పుడున్నా మెరుపుల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతున్నారు.

ఏపీలో బీజేపీ, టీడీపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్నా పురందేశ్వ‌రి మాత్రం వీలున్న‌ప్పుడల్లా త‌న వ్యాఖ్యాల‌తో చంద్ర‌బాబును ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి భూసేక‌ర‌ణ విష‌యంలో సైతం ఆమె అక్క‌డ ప‌ర్య‌టించి బాబు స‌ర్కార్‌ను టార్గెట్‌గా చేసుకుని చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో పెద్ద క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత కూడా ఏపీకి కేంద్రం ఎన్నో నిధులు ఇస్తున్నా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాత్రం ఆ క్రెడిట్ బీజేపీకి ద‌క్క‌నీయ‌డం లేద‌ని ఆమె ప‌లుమార్లు చంద్ర‌బాబును టార్గెట్‌గా చేసుకుని డైరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్‌గానో విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇక తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు చంద్ర‌బాబును మ‌రోసారి క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ వైసీపీ ఇన్‌చార్జ్ చెరుకుల‌పాడు నారాయ‌ణ‌రెడ్డి హ‌త్య కేసులో చేసిన వ్యాఖ్య‌లు అటు చంద్ర‌బాబుతో పాటు ఇటు అధికార టీడీపీకి పెద్ద ఇబ్బందిగా మారాయి. ఓ వైపు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండి, ప‌త్తికొండ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కేఈ.కృష్ణ‌మూర్తి ఈ హ‌త్య చేయించిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇవిలా ఉండ‌గానే పురందేశ్వ‌రి ఫ్యాక్ష‌నిజం మ‌ళ్లీ మొద‌లెడుతున్నారంటూ చేసిన వ్యాఖ్య‌లు టీడీపీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఆమె వ్యాఖ్య‌లు ఇన్‌డైరెక్టుగా చంద్ర‌బాబునే టార్గెట్ చేశార‌ని ప‌లువురు అంటున్నారు. పురందేశ్వ‌రి వ్యాఖ్య‌ల‌పై అటు చంద్ర‌బాబుతో పాటు ఇటు టీడీపీ నాయ‌కులు కూడా డంగ్ అయిపోయారు. ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తే టీడీపీ వాళ్లు త‌ప్పు ఒప్పుకున్న‌ట్లు అవుతుంది. దీంతో అన‌వ‌స‌రంగా కొరివితో త‌ల‌గోక్కోవ‌డం ఎందుకని వారు మౌనం పాటిస్తున్నారు. దీనిపై మిగిలిన బీజేపీ నాయ‌కులు ఎవ్వ‌రూ స్పందించ‌క‌పోయినా కేవ‌లం పురందేశ్వ‌రి మాత్ర‌మే స్పందించ‌డం చూస్తుంటే ఆమె బాబును టార్గెట్ చేసిన ఉద్దేశం స్ప‌ష్టంగా క‌నిపించిన‌ట్ల‌వుతోందన్న సందేహాలు క‌లుగుతున్నాయి.