టీడీపీలో పురందేశ్వ‌రి లేఖ క‌ల‌క‌లం

ఏపీలో కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఎంత ర‌చ్చ ర‌చ్చ‌గా మారింతో మీడియాలో వ‌స్తోన్న వార్త‌లే చెపుతున్నాయి. న‌లుగురు ఫిరాయింపుదారుల‌కు చంద్ర‌బాబు త‌న కేబినెట్‌లో చోటు క‌ల్పించారు. గ‌తంలో తెలంగాణ‌లో టీడీపీ త‌ర‌పున గెలిచిన త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్‌కు కేసీఆర్ త‌న కేబినెట్‌లో చోటు కల్పించ‌డంతో టీడీపీ అండ్ కోతో పాటు చంద్ర‌బాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదే అంశాన్ని వారు సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు తీసుకెళ్లారు.

ఇక నాడు కేసీఆర్ చేసింది త‌ప్పు అని జాతీయ‌స్థాయిలో వ‌క్కాణించిన చంద్ర‌బాబు ఇప్పుడు అదే త‌ప్పు తాను చేసి దానిని ఒప్పు అని చూపించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజా ప్ర‌క్షాళ‌న‌లో చంద్ర‌బాబు ఏకంగా న‌లుగురు ఫిరాయింపుదారుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు.

ఆది నారాయణరెడ్డి  – భూమా అఖిల‌ప్రియ – అమ‌ర్‌నాథ్‌రెడ్డి – సుజ‌య్ కృష్ణ రంగారావుకు బాబు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే పార్టీ ఫిరాయింపులపై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురేందేశ్వరి లేఖ రాయడం టీడీపీలో కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించడాన్ని లేఖలో ఆమె తప్పుబట్టారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఫిరాయింపుల చ‌ట్టం అప‌హాస్యం అవుతుంద‌ని ఆమె త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఏపీ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీ ఫిరాయింపుల‌ను ప్రోత్సాహించ‌డం క‌రెక్ట్ కాద‌ని కూడా ఆమె స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే ఫిరాయింపు దారుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డంపై విప‌క్షాలు, స్వ‌ప‌క్షం నుంచే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోన్న చంద్ర‌బాబుకు పురందేశ్వ‌రి లేఖ రాయ‌డం షాకింగ్ న్యూస్ లాంటిదే.

బాబుకు మ‌రో షాక్ ఏంటంటే బాబుకు అత్యంత స‌న్నిహితుడు అయిన మ‌రో కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు సైతం ఫిరాయింపుల‌ను త‌ప్పుబ‌ట్టారు. ఈ లెక్క‌న చూస్తుంటే బాబును బీజేపీ టార్గెట్ చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది.