వైసీపీలోకి ద‌గ్గుపాటి… కెవిపి, ఉండ‌వ‌ల్లి మ‌ధ్య‌వ‌ర్తిత్వం..!

గ‌తేడాది రిలీజ్ అయిన జాగ్వార్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. తాను ఎద‌గ‌డం కోసం ప‌దిమందికి మొక్క‌డానికి అయినా వంద‌మందిని తొక్క‌డానికి అయినా సిద్ధం. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ పైన చెప్పుకున్న డైలాగ్‌నే కాస్త అటూగా పాటించేస్తున్నాడ‌నిపిస్తోంది. చాలా మొండిఘ‌టం అయిన జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుకోసం చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల‌నే ప‌క్క‌న పెట్టేస్తార‌ని తెలుస్తోంది. అలాగే చంద్ర‌బాబును దెబ్బ‌కొట్టేందుకు ఎంత‌కైనా కింద‌కు దిగుతున్నారు.

టీడీపీకి ప‌ట్టున్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీకి కీల‌క‌మైన సామాజిక‌వ‌ర్గం వారికే ప్ర‌యారిటీ ఇస్తాన‌న్న సంకేతాలు పంపుతోన్న జ‌గ‌న్ ఇప్పుడు ఏకంగా చంద్ర‌బాబు బంధువుల ఫ్యామిలీపైనే దృష్టిపెట్టిన‌ట్టు తెలుస్తోంది. దివంగ‌త ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి, ఆమె భ‌ర్త ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావుతో చంద్ర‌బాబుకు తీవ్ర స్థాయిలో విబేధాలు ఉన్నాయి.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పురందేశ్వ‌రి బీజేపీలో చేరారు. ఆమెను ఎలాగైనా ఓడించాల‌న్న ప్లాన్‌తోనే ఆమె ఓడిపోతుంద‌ని తెలిసే చంద్ర‌బాబు ఆమెకు రాజంపేట సీటు కేటాయించార‌న్న‌ది టాక్‌. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత బీజేపీలో ఉన్న ఆమె చంద్ర‌బాబు టార్గెట్‌గా విమ‌ర్శ‌లు చేస్తున్నా స‌రైన ప్ర‌యారిటీ మాత్రం ఉండ‌డం లేదు. ఇదిలా ఉంటే ద‌గ్గుపాటి దంప‌తుల‌ను వైసీపీలోకి తీసుకువెళ్లేందుకు పెద్ద స్కెచ్ రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది.

జ‌గ‌న్‌ను ఎలాగైనా సీఎం చేయాల‌ని తెర‌వెన‌క ఎంతో కృషి చేస్తోన్న కేవిపి.రాంచంద్ర‌రావు, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఈ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఇక తాజాగా ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు రాజమండ్రి వచ్చి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ద‌గ్గుపాటి పోల‌వ‌రం ప‌రిశీల‌న‌కు మాత్ర‌మే వ‌చ్చాన‌ని చెపుతున్నా దానిని న‌మ్మేందుకు ఎవ్వ‌రూ సిద్ధంగా లేరు. త‌న కుమారుడు ద‌గ్గుపాటి చెంచురామ్ పోలిటిక‌ల్ ఎంట్రీ కోసం ద‌గ్గుపాటి దంప‌తులు కొద్ది రోజులుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టీడీపీలో త‌మ వార‌సుడికి టిక్కెట్ వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేక‌పోవ‌డంతో వాళ్లు స‌రైన ఆల్ట్ర‌నేటివ్ కోసం ట్రై చేస్తున్నారు.

బీజేపీతో పొత్తు ఉన్నా చంద్ర‌బాబు ప‌ర్చూరు సీటు త‌మ‌కు ఇస్తార‌న్న గ్యారెంటీ లేదు. ఈ క్ర‌మంలోనే జ‌గన్ నుంచి ద‌గ్గుపాటి ఫ్యామిలీకి రెండు ఆఫ‌ర్లు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. పురందేశ్వ‌రికి కోస్తాలో కోరుకున్న ఎంపీ సీటుతో పాటు చెంచురామ్‌కు ప‌ర్చూరు వైసీపీ సీటు ఇస్తామ‌న్న ప్ర‌తిపాద‌న‌ను కెవిపి, ఉండ‌వ‌ల్లి వాళ్ల ముందు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ద‌గ్గుపాటి దంప‌తులు వైసీపీలోకి వెళితే ఏపీ రాజ‌కీయాల్లో పెను ప్ర‌కంప‌న‌లు త‌ప్ప‌వు.